● 19న ఎంపీపీ, వైస్ ఎంపీపీ,20న జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ● ఆయా తేదీల్లో మండలానికి ఒకరు, జెడ్పీకి ఇద్దరు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ● ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో ఎన్నికలు
కర్నూలు(అర్బన్): గత నెల 21వ తేదీ నుంచి ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఈ నెల 5న పోలింగ్, 7వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయిన నేపథ్యంలో ఇక మిగిలిన మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 19న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, 20వ తేదీన జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు పలు సూచనలు చేస్తూ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ ఎన్నికలను నిర్వహించేందుకు కొన్ని గంటల ముందే మండలాల్లో ఒకరు, జిల్లా పరిషత్‌లో ఇద్దరు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు పూర్తయిన అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో నిర్వహించనున్నారు.
ఎంపీపీ ఎన్నికకు..
మండల పరిషత్ అధ్యక్షున్ని ఎన్నుకునేందుకు ముందు గా ఈ నెల 14వ తేదీలోపు ఆయా మండలాల్లో ఎన్నికై న ఎంపీటీసీలందరికీ 19వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికకు ముందుగా అదే రోజు ఉదయం 10 గంటల్లోపు ఆయా మండలాల్లో కోఆప్షన్ సభ్యున్ని ఎన్నుకునేందుకు నామినేషన్లను స్వీకరించాలి. మధ్యాహ్నం 12 గంటల్లోపు నామినేషన్లను పరిశీలించి చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితాలను ప్రచు రించాల్సి ఉంది. అలాగే మధ్యాహ్నం 1 గంటలోపు(కోఆప్షన్ సభ్యునికి పోటీ ఉంటే) నామినేషన్ల ఉపసంహరణ అనంతరం సభ్యుల ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కోఆప్షన్ సభ్యున్ని ఎన్నుకుంటారు. కోఆప్షన్ సభ్యుని ఎన్నిక పూర్తయిన అనంతరం మధ్యా హ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకుంటారు.
జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు..
జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కూడా ఈ నెల 14లోగా జెడ్పీటీసీలుగా ఎన్నికై న వారందరికీ 20వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అదే రోజున ఉదయం 10 గంటల్లోపు ఇద్దరు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునేందుకు నామినేషన్లను స్వీకరిస్తారు. మధ్యా హ్నం 12 నామినేషన్ల పరిశీలన, 1 గంటలోపు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలోనే సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌ను సభ్యులు ఎన్నుకుంటారు.
కోఆప్షన్ సభ్యులుగా ఎవరిని ఎన్నుకోవాలంటే..
మండల పరిషత్, జిల్లా పరిషత్‌కు ఆయా మండల/జిల్లాలో ఓటరుగా నమోదై, కనీసం 21 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. మతపరంగా ముస్లిం, క్రిస్టి యన్, సిక్కు, బౌద్దులు, పార్సీలను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటారు.
వైఎస్ జగన్ పాలనలో ఇద్దరు వైస్ చైర్మన్లు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో జిల్లా పరిషత్‌కు ఇద్దరు వైస్ చైర్మన్లను నియమించారు. అప్పట్లో ఈ విధానం అమల్లో ఉన్న నేపథ్యంలో జెడ్పీ ఛైర్మన్ పదవి అన్ రిజర్వుడ్ జనరల్‌కు కేటాయించగా, వైస్ ఛైర్మన్లుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన హొళగుంద జెడ్పీటీసీ కురువ బుజ్జమ్మ, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన దిల్షాద్‌నాయక్ కొనసాగారు. అలాగే మండలాల్లో కూడా ఒక ఎంపీపీతో పాటు ఇద్దరు వైస్ ఎంపీపీలు కొనసాగారు. అయితే, ప్రస్తుతం మండల, జిల్లా పరిషత్తుల్లో వైస్ ఎంపీపీ, చైర్మన్ల సంఖ్యను ఒకటికే పరిమితం చేశారు.


