● 23వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎస్.వెంకటరమణకు వేధింపులు
కర్నూలు(సెంట్రల్): ఓటమిని ఒప్పుకుంటావా.. లేదంటే టింబర్ డిపోను మూసివేయాలా అని కర్నూలు నగర పాలక సంస్థ 23వ వార్డు కార్పొరేటర్‌గా వైఎస్‌ఆర్‌సీపీ తరపున పోటీ చేసిన ఎస్.రమణయ్యపై ఫారెస్టు అధికారులు తీవ్ర ఒత్తిడి చేయడం చర్చనీయాంశమైంది. మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి ఎస్.వెంకటరమణ 59 ఓట్లతో విజయం సాధించానని చెబుతున్నాడు. అయితే మంత్రి టీజీ భరత్ కౌంటింగ్ కేంద్రంలో కూర్చోని తన గెలుపును తారుమారు చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. దీంతో తాను ఓటమిని ఒప్పుకోకుండా సంతకం చేయలేదని, తనకు కౌంటింగ్ కేంద్రంలో జరిగిన అన్యాయంపై కోర్టుకు వెళ్లినట్లు వివరణ ఇస్తున్నారు. అయితే తనను టీడీపీ నాయకులు ఎలాగైనా లొంగదీసుకునేందుకు బెదిరింపులనకు పాల్పడుతున్నట్లు వాపోతున్నాడు.
విజిలెన్స్‌కు ఫిర్యాదు
మంత్రి టీజీ భరత్ గుప్తా అనుచర న్యాయవాది ఒకరు ఎస్.వెంకటరమణ జొహరాపురంలో నిర్వహిస్తున్న అల్ట్రాలక్స్ టింబర్ డిపోలో అక్రమాలు ఉన్నాయని విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పూర్తి స్థాయిలో విచారించాలని అటవీశాఖకు బదిలీ చేశారు. ఈ క్రమంలో అటవీ శాఖాధికారులు నవంబర్ 7వ తేదీ సాయంత్రం ఎస్.వెంకటరమణయ్య టింబర్ డిపోను తనిఖీ చేసి 24 టన్నులు కలప ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి అన్ని బిల్లులు ఉన్నట్లు చూపించారు. అయితే అల్ట్రాలక్స్ టింబర్ డిపో లైసెన్స్ కాల పరిమితి ముగిసింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖాధికారులు బయట ఏమైనా సెటిల్ చేసుకుంటావా, లేదంటే డిపోను మూసివేయాలా అని తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. పైగా డిపోలో ఉన్న కలపకు ఎలాంటి బిల్లులు లేవని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఓటమిని అంగీకరించి సంతకం చేయాలని నిమిష నిమిషానికి ఫోన్ చేస్తుండటంతో వెంకటరమణ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.


