కోవెలకుంట్ల: నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో నంద్యాల నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు ప్రతి రోజు నడిచే డెమూ రైలును (77211) మంగళవారం నుంచి వైఎస్సార్‌జిల్లా నందలూరు వరకే కుదించారు. రేణిగుంట యూడ్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్న దృష్ట్యా ఈ మార్గంలో రైలు ప్రయాణ సేవలను తగ్గించారు. నంద్యాలలో ఉదయం 6 గంటలకు బయలుదేరే డెమో బనగానపల్లె, కోవెలకుంట్ల, నొస్సం, వైఎస్సార్‌జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు రేణిగుంట చేరుకునేది. తిరిగి అక్కడ మధ్యాహ్నం 1.45 గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో రాత్రి 8.45 గంటలకు నంద్యాలకు వచ్చేది. రేణిగుంట స్టేషన్ వద్ద జరుగుతున్న మరమ్మతు పనుల దృష్ట్య్టా నవంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 27 వరకు 48 రోజులపాటు డెమూ రైలు నంద లూరు వరకు మాత్రమే నడుస్తుందని రైల్వేశాఖ అధికారులు పేర్కొన్నారు. రైలు టైమింగ్స్‌లో ఎలాంటి మార్పులు ఉండవని వెల్లడించారు. ప్రతి రోజు డెమూ రైలు నందలూరుకు ఉదయం 9.40 గంటలకు చేరుకుని తిరిగి మధ్యాహ్నం 3.15 గంటలకు 77212 నంబర్ రైలు అక్కడి నుంచి బయలుదేరి రాత్రికి నంద్యాలకు చేరుకుంటుందని వివరించారు. రైల్వే ప్రయాణికులు ఈ మార్పును గమనించి రైలు ప్రయాణం చేయాలని సూచించారు.
● రేణిగుంట స్టేషన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు
● 48 రోజులు రైలు సేవలు కుదింపు


