డోన్ టౌన్: ఓ ప్రయాణికుడు ఆర్టీసీ బస్సులో రూ.2.55 లక్షల నగదు ఉన్న బ్యాగ్ మరిచిపోగా, డ్రైవర్ గుర్తించి నిజాయితీగా అందజేశారు. ఈ నెల 7వ తేదీ డోన్ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి డోన్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో జడ్చర్లలో ఒక వ్యక్తి బస్సెక్కి కర్నూలు కు చేరుకున్న సమయంలో తన బ్యాగును మరిచిపోయి దిగిపోయాడు. ఆ తరువాత డోన్‌కు చేరుకున్న బస్సు నుంచి ప్రయాణికులు అందరూ దిగిపోయిన తర్వాత డ్రైవర్ రామకృష్ణకు ఒక బ్యాగ్ కనిపించింది. దీన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటచలపతి, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి తెరిచి చూశారు. అందులో రూ.2.55,900, బ్యాంక్ పాస్ బుక్, మెడికల్ రిపోర్ట్సు ఉన్నాయి. వాటి ద్వారా బాధితుడికి సమాచారం ఇచ్చా రు. అతను అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉండగా, కుటుంబ సభ్యులు మంగళవారం డోన్ చేరుకుని ఆర్టీసీ అధికారులను కలిశారు. ఈ మేరకు డ్రైవరు రామకృష్ణ చేతుల మీదుగా నగదు బ్యాగును అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలుపగా ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు అభినందించారు.


