ఆగని అరాచక పర్వం | - | Sakshi
Sakshi News home page

ఆగని అరాచక పర్వం

Nov 10 2026 2:01 AM | Updated on Nov 10 2026 2:01 AM

ఆళ్లగడ్డ: పచ్చ మూకల అరాచకాలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గూండాలు అరాచకాలు పరాకాష్టకు చేరాయి. తాజాగా దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామం సర్పంచ్‌ అభ్యర్థులుగా పోటీచేసేందుకు సిద్ధమవుతున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడికి తెగబడటం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. గ్రామ సర్పంచ్‌ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతున్న నేపథ్యంలో కొండాపురం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులుగా పోటీ చేసేందుకు తమలో ఒకరిని ఎంపిక చేసుకున్నారు. ఎంత ఖర్చు అయినా.. పోటీ చేసి గెలుపొందాలని తీర్మానించుకున్నారు. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ముందుగా వీరిని సున్నితంగా బెదిరించినా వారు వెనక్కి తగ్గలేదు. దీంతో ఎలాగైనా వారిని అడ్డుతొలగించాలని కుట్ర పన్నారు. ఈ మేరకు పచ్చ ముసుగు రౌడీలకు విషయం చెప్పడంతో వారు రెండు రోజుల నుంచి మాటేసినట్లు తెలిసింది. ఈ మేరకు శనివారం సాయంత్రం సాయికుమార్‌రెడ్డి అతని డ్రైవర్‌ మహబూబ్‌ పీరాతో కలిసి బైక్‌పై ఆళ్లగడ్డకు వస్తుండటం గమనించి పచ్చ ముసుగు రౌడీలకు సమాచారం చేరవేశారు. పట్టణ శివారులోని జాతీయ రహదారి లింగందిన్నె అప్రోచ్‌ రోడ్డు సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా ఇన్నోవా వాహనం వచ్చి ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు పడ్డారు. వెంటనే కారులో నుంచి దిగిన మోకానికి ముసుగు, తలకు నెట్‌ క్యాప్‌ ధరించిన దుండగులు ఒక్కసారిగా దాడి చేస్తుండటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, పొలాల్లో ఉన్న వారు కేకలు వేయడంతో అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. గాయపడిన సాయికుమార్‌రెడ్డి, మహబూబ్‌పీరాలు పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని కొండాపురం గ్రామానికి చెందిన శివారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాథ్‌రెడ్డితో పాటు మరికొందరు ముసుగు ధరించి తమపై దాడి చేసి హత్య చేసేందుకు యత్నించారని ఫిర్యాదు చేశారు. సర్పంచ్‌ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్న యువకులపై దాడి జరిగిందనే విషయం తెలిసినప్పటి నుంచి వివిధ గ్రామాల్లో సర్పంచులుగా పోటీ చేయాలనుక్ను ఆశావహులు భయాందోళన చెందుతున్నారు. పార్టీతో సంబంధం లేని ఎన్నికలు కావడంతో ఎవరికి వారు పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నా వారికి పార్టీ ముద్ర వేసి దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గాయపడిన సాయికుమార్‌రెడ్డి, మహబూబ్‌పీరా

నిద్రలేవని ఖాకీలు!

జిల్లాలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో పచ్చముఠా అరాచకాలకు పాల్పడుతున్నా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రశాంతంగా కునుకు తీస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెల ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు మొదలైన మొదటి రోజునే ఆళ్లగడ్డ మండలంలోని బాచేపల్లిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ముసుగు రౌడీలు కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడిచేసి హత్య చేసేందుకు యత్నించిన సంఘటన తీవ్ర కలకలం లేపింది. ఇదే తరహాలో ఆళ్లగడ్డ వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పోటీచేసిన ఏఎన్‌ఆర్‌ షరీఫాబీ కొడుకు సాధిక్‌ పట్టణంలోని తన ఇంటిదగ్గర ఉండగా ఈ నెల 4వ తేదీన ముసుగు రౌడీలు కత్తులతో దాడిచేసి హత్య చేసేందుకు యత్నించారు. మళ్లీ ఈ నెల 7వ తేదీన షరీఫాబీ ఇంటి ముందున్న రెండు కార్లను అర్ధరాత్రి పెట్రోలు పోసి తగలబెట్టడం జరిగింది. ఇది జరిగిన మరసటి రోజే మళ్లీ కొండాపురం వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ శ్రేణులపై జరిగిన దాడి ఈ వరుస దాడుల పరంపరకు పరాకాష్టగా నిలిచింది. వరుస ఘటనలు ఒకే తరహాలో జరుగుతున్నా పోలీసులు మాత్రం కంటి తుడుపు చర్యలతో (కేసు నమోదు చేసుకున్నాం దర్యాప్తు చేస్తున్నాం) సరిపెడుతున్నారు. ‘తమ్ముళ్లు’తమ పని ముగించుకుని వెళ్లే దాక పోలీసులు అటువైపు చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా పోలీసులు పక్షపాత వైఖరి వీడి పచ్చ గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడాలని పలువురు కోరుతున్నారు.

వైఎస్సార్‌సీపీ నేతలపై

కొనసాగుతున్న ముసుగు దాడులు

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో

బరితెగిస్తున్న పచ్చమూకలు

తాజాగా కొండాపురం

సర్పంచు అభ్యర్థులపై దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement