● మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి
బొమ్మలసత్రం: ప్రజాస్వామ్యం సిగ్గుతో తలవంచుకునేలా జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వీధి రౌడీల్లా వ్యవహరించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాక్షాత్తు ఎమ్మెల్యే బుడ్డా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడికి యత్నించాడని, ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్ పాల్పడాలనే ఉద్దేశంతో తమను ముందస్తుగా అరెస్ట్‌లు చేయించారన్నారు. ఆత్మకూరు సాక్షి రిపోర్టర్‌పై దాడి చేయించి అక్కడ ఉన్న గ్రామాల్లో పట్టు సాధించాలని చూడటం దుర్మార్గమన్నారు. ఆత్మకూరు డీఎస్పీ, సీఐలకు ఎమ్మెల్యే పచ్చా చొక్కాలు వేయించి ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడేలా బెదిరించారన్నారు. కార్యకర్తలను, అభ్యర్ధులను ఫోన్‌లో బెదిరించడాలు, ఇళ్ల వద్దకు వెళ్లి భయపెట్టాలని చూసినా ఎవరూ బెదర లేదన్నారు. ఇలాంటి చర్యలను ప్రజలు సహించబోరని, త్వరలో ఇలాంటి నేతలకు తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యకర్తలు ఇలాంటి దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరంలేదని రానున్న పంచాయతీ ఎన్నికల్లో తప్పకుండా వందకు వంద శాతం విజయం సాధించి తీరుతామన్నారు. సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వరరెడ్డి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.


