ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో సోమవారం స్వాతి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేకువ జామునే సుప్రభాత సేవతో స్వామి, అమ్మవార్లను మేలుకొలిపి దివ్య దర్శనం అనంతరం నిత్యపూజలతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను యాగశాలలో కొలువుంచి అభిషేకం, అర్చన, తిరుమంజనం చేపట్టారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆతర్వాత అర్చకుల వేద మంత్రోచ్చారణలు.. ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యా ల మధ్య శ్రీ స్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించారు. రాత్రి ఉత్సవ పల్లకీలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడవీధుల్లో సంచరిస్తూ భక్తులను కనువిందు చేశారు.


