మున్సిపల్ ఎన్నికల తరహాలోనే కూటమి నేతలు ప్రాదేశిక ఎన్నికల్లో బరితెగించారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా వ్యతిరేకత అంతకంతకు పెరుగుతున్నా, ప్రజాదరణ తమకే ఉందనే భ్రమను కలిగించేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకొని వివిధ రూపాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. వైఎస్సార్‌సీపీకి మంచి పట్టు ఉన్న గ్రామాల్లో కూడా నామినేషన్లను అడ్డుకోవడం, దర్జాగా రీసైక్లింగ్, రిగ్గింగ్ చేసుకున్నారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నా, జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి కూడా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను వెళ్లనీయకుండా పలు ప్రాంతాలో అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు, పోలీసులు, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అలాగే ... పలు ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో విజయం సాధిస్తే, డిక్లరేషన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడమే గాక, రీకౌంటింగ్ పేరుతో కాలయాపన చేశారు. అదే టీడీపీకి చెందిన అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో బయటపడితే వెంటనే డిక్లరేషన్ ఇవ్వడం గమనార్హం. మొత్తం మీద ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏకపక్షంగా జరిపించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించారు. జూపాడుబంగ్లా మండలంలో 7 ఓట్లతో ఓడిన 80 బన్నూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాలీశ్వర్‌గౌడు రీకౌంటింగ్ అడగకుండా పోలీసులు నోరునొక్కేయటం, 48 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన తూడిచెర్ల వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి కోట్ల పెద్దచెన్నారెడ్డికి డిక్లరేషన్ ఫారం ఇవ్వకుండా వేధించిన ఘటనలు కౌంటింగ్ కేంద్రం వద్ద అధికాపార్టీ నాయకులు, పోలీసుల ప్రతాపం ఎంతలా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు.


