కర్నూలు: వరకట్న నిషేధ చట్టం 1961 ద్వారా కట్నం తీసుకోవడం లేదా ఇవ్వడం చట్ట ప్రకారం నేరమని వరకట్న వేధింపులకు కఠిన శిక్షలు ఉన్నాయని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, లా కాలేజీ, విద్యా శాఖ సహకారంతో మహిళల హక్కులు, రక్షణ, లింగ సమానత్వం, మహిళలకు సంబంధించిన ప్రాథమిక హక్కులపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శుక్రవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రితో పాటు శాశ్విత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వన్‌స్టాప్ సెంటర్ సిబ్బంది, విద్యాశాఖ, మహిళా పోలీసులు, పోలీసులు, లా కాలేజీ విద్యార్థులు, ఎన్‌జీఓలు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటశేషాద్రి మాట్లాడుతూ.. మహిళలకు చట్టపరంగా కీలకమైన రక్షణలు, హక్కులు ఉన్నాయని తెలిపారు. గృహ హింస నిరోధక చట్టం – 2005 గురించి వివరించారు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకటహరినాథ్ మాట్లాడుతూ.. పనిచేసే చోట మహిళలకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం – 2013 గురించి వివరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు ఇన్‌చార్జ్ డైరెక్టర్ నారాయణమ్మ, లీగల్ ఎయిడ్ మెంబర్ రాయపాటి శ్రీనివాస్, లీగల్ టీమ్ సభ్యులు, ఎన్‌జీఓలు పాల్గొన్నారు.
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
ఆదోని అర్బన్: పట్టణంలోని విక్టోరియాపేటకు చెందిన ఉప్పర విజయ్‌కుమార్ (30) భార్య కాపురానికి రానని చెప్పడంతో శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పర విజయ్‌కుమార్ బేల్దారి, సిలిండర్ బాయ్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆయనకు భార్య, నలుగురు ఆడ పిల్లలు సంతానం. భార్యభర్తలు గొడవ పడడంతో భార్య పుట్టింటికి వెళ్లి తిరిగిరాలేదు. పలుసార్లు ఉప్పర విజయ్‌కుమార్ ఇంటికి రావాలని కోరినా, తాను రానని భార్య తెగేసి చెప్పడంతో మనస్తాపం చెంది ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదోని వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


