● నకిలీ డాక్యుమెంట్లతో
ప్రైవేటు ప్లాట్ల ఆక్రమణ
● పోలీస్‌స్టేషన్ చేరిన పంచాయితీ
కర్నూలు: కర్నూలులో తెలుగు తమ్ముళ్ల గూండాగిరి శృతి మించింది. మంత్రి, పొరుగు నియోజకవర్గం ఎమ్మెల్యే అండతో ప్రైవేటు వెంచర్‌లో కొనుగోలు చేసిన స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించుకున్నారు. ఈ సంఘటన వివాదంగా మారి పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. కర్నూలు శివారులోని కోడుమూరు రోడ్డులో రిలయన్స్ సూపర్ మార్కెట్ లైన్‌లో సర్వే నెంబర్ 292లో అబ్దుల్లా నగర్ పేరుతో వెంచర్ వెలిసింది. దాదాపు 3.95 ఎకరాల్లో వెలసిన ఈ వెంచర్‌లో 32 మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. రూ.కోట్లు విలువ చేసే ఈ స్థలంపై మంత్రి, ఎమ్మెల్యే అనుచరుల కన్ను పడింది. 1914లో కొనుగోలు చేసినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మొత్తం స్థలాన్ని కబ్జా చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. విశ్వబ్రాహ్మణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్, నంద్యాల జిల్లా టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పార్వతమ్మ కుమారుడు జనార్ధన్ ఆచారి, ఎమ్మెల్యే అనుచరుడు వడ్డె నాగేశ్వరరావు, మంత్రి అనుచరుడు తిలక్‌నగర్‌కు చెందిన తెలుగు మహేష్ తదితరులు ప్రైవేటు ప్లాట్లకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించుకున్నారు. దీంతో వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసినవారు కోర్టుకు వెళ్లగా ఇంజక్షన్ ఆర్డర్ మంజూరు చేయడంతో సోమవారం స్థలం దగ్గరికి వెళ్లి తమ స్థలాన్ని ఖాళీ చేయాలని తెలుగు తమ్ముళ్లపై ఒత్తిడి చేశారు. స్థలంలో అక్రమంగా వేసిన కొట్టాన్ని తొలగించి కాంపౌండ్ వాల్‌ను పగలగొట్టడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. తెలుగు తమ్ముళ్లు దాదాపు 50 మంది రౌడీలను తీసుకువచ్చి స్థలం యజమానులపై దాడికి ప్రయత్నించారు. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఆక్రమణదారులకు మంత్రి, ఎమ్మెల్యే అండ ఉండటంతో బాధితులపైనే కేసు నమోదు చేస్తామని పోలీసులు బెదిరించినట్లు సమాచారం.
ఆక్రమణ స్థలంలో
అసాంఘిక కార్యకలాపాలు...
తెలుగు తమ్ముళ్లు ఆక్రమించుకున్న స్థలంలో గుడిసె వెలిసింది. అందులో ప్రతిరోజూ పేకాటతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. 1914లోనే ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుగు తమ్ముళ్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


