ఫోర్జరీ సంతకంపై మున్సిపల్ కమిషనర్ శేషన్నతో ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే శిల్పారవి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా (ఫైల్)
నంద్యాలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు టీడీపీ మూకలు ఫోర్జరీ పత్రాల సృష్టి
ఏకగ్రీవమైందంటూ పచ్చమూకల హంగామా.. మంత్రి సమక్షంలో సంబరాలు
చివరికి నీళ్లు చల్లిన ఈసీ
ఏకగ్రీవాన్ని రద్దుచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని బరిలో ఉన్నట్లు ఆర్వో ప్రకటన
నంద్యాల (అర్బన్): టీడీపీ నాయకుల అత్యుత్సాహం బెడిసికొట్టింది. ఫోర్జరీ ముసుగులో ఏకగ్రీవానికి పాల్పడ్డ పచ్చ మూకలు చివరికి అభాసుపాలయ్యారు. నంద్యాల పట్టణం 51వ వార్డులో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలివీ.. నంద్యాల మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ల ఎన్నికలను పురస్కరించుకుని ఈ నెల 21న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణలో 51వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని అవ్వారి నాగమణి ఉపసంహరించుకున్నట్లు టీడీపీ మూకలు ఫోర్జరీ సంతకంతో ఓ నామినేషన్‌ను సృష్టించారు. దీంతో టీడీపీ అభ్యర్థి తాటికొండ విజయ ఏకగ్రీవం అయినట్లు ఆర్వో మోహన్‌రావు ప్రకటించేశారు. అయితే, ఏకగ్రీవ పత్రం ఇచ్చిన సమయంలో ఎన్నికల అధికారి అక్కడ లేకుండాపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక ఏకగ్రీవ పత్రంతో ఆ వార్డు టీడీపీ నాయకులు నానా హంగామా చేశారు. మంత్రి ఫరూక్, ఇతర టీడీపీ నాయకులు 51వ వార్డులో టీడీపీ విజయంతో బోణీ కొట్టిందంటూ సంబరాలు చేసుకున్నారు.
వైఎస్సార్‌సీపీ పోరాటంతో..
సీన్ కట్‌చేస్తే.. ఫోర్జరీ సంతకంతో అయిన ఏకగ్రీవం చెల్లదంటూ వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఫోర్జరీ పత్రం గురించి తమకేమి తెలీదని, తాను అందుకు అథారిటీనే కాదంటూ మున్సిపల్ కమిషనర్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఫోర్జరీ విషయాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తీసుకువెళ్లడమే కాక బాధిత అభ్యర్థిని నాగమణిని జగన్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన స్పందిస్తూ.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని సంతకం ఫోర్జరీ చేసి ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్లు చూపించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం.. ఈసీ జోక్యంతో తాటికొండ విజయ ఏకగ్రీవ పత్రాన్ని రద్దుచేసి నాగమణి ఎన్నికల బరిలో ఉన్నట్లు నంద్యాల మున్సిపాలిటీ ఎన్నికల అధికారి మోహన్‌రావు ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.


