● స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి బుగ్గన
సమావేశానికి హాజరైన పార్టీ నాయకలు,కార్యకర్తలు
డోన్(ప్యాపిలి): రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలన సాగుతోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. ప్యాపిలిలో శనివారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బుగ్గన మాట్లాడుతూ..వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం, వేధించడం తప్ప చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో ఏమీ చేయలేదన్నారు. లాకప్‌డెత్‌లు, పోలీసుల చేతుల్లో చిత్ర హింసలు లాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రోజు రోజుకూ మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు అరాచక పాలనకు నిదర్శనంగా నిలిచాయన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీనెయ్యి ఉందని ప్రజలను నమ్మించాలని చూసి చంద్రబాబు సర్కార్ అభాసుపాలైందన్నారు.
ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలి
రాష్ట్రంలో అనేకసార్లు అధికారం చేపట్టానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ప్రజలందరికీ ఉపయోగపడే సంక్షేమ పథకాన్ని ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. మహానేత, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన 108, ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాలు ఎప్పటికీ గుర్తిండి పోతాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత పంటలబీమా, పొదుపు రుణాలమాఫీ, రైతు భరోసా, గ్రామ, వార్డు సచివాలయాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు మరోసారి గుర్తుచేయాలని సూచించారు. టీడీపీ పాలనలో వైఫల్యాల ఇంటింటికీ చెప్పాలన్నారు. ‘స్థానిక’ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తే వైఎస్సార్‌సీపీదే విజయమన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు చిన్న పూజర్ల రామచంద్రారెడ్డి, నాగభూషణంరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ బోరెడ్డి పుల్లారెడ్డి, ప్యాపిలి మాజీ సర్పంచ్ లక్ష్మిదేవి, బొరా మల్లికార్జునరెడ్డి, రామసుబ్బయ్య, బాలయ్య, ఎర్రగుండ్లపల్లి వెంకటేశ్వరెడ్డి, కొండయ్య, బోరెడ్డి రఘునాథ్‌రెడ్డి, నరసింహారెడ్డి, జక్కసానిగుంట్ల రామకృష్ణ, గడ్డం భూవనేశ్వరరెడ్డి, గండికోట రామాంజి, ధనుంజయశెట్టి తదితరులు పాల్గొన్నారు.
‘బాబు’ మాయలోడు!
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఉచిత బస్సు, పింఛన్ మొత్తం పెంపు తప్ప అన్నింటినీ తుంగలోకి తొక్కారన్నారు. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వలేదన్నారు. ప్రతి నెలా రూ.1,500 ఆడబిడ్డ నిధి ఇస్తామని మహిళలను మోసం చేశారన్నారు. ఉదోగ్యం వచ్చేంత వరకు ప్రతి నెలా రూ.3000 భృతి ఇస్తామని నిరుద్యోగులను దగా చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, హామీలన్నీ అమలు చేశామని సీఎం చంద్రబాబు మాయమాటలు చెబుతారని, ప్రజలు ఎవరూ నమ్మవద్దని సూచించారు. టీడీపీ నేతలకు, కూటమి నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల్లో ‘కూటమి’ కుట్రలు, కుతంత్రాలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు.


