మహానంది: మహానందీశ్వరుడికి హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ. 52,84,001 ఆదాయం లభించినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహానందిలోని అభిషేక మండపంలో శనివారం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ నరాల చంద్రమౌళీశ్వరరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో హుండీ కానుకలను లెక్కించారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఆలయాల్లోని హుండీల ద్వారా రూ. 52,38,734, అన్నప్రసాదం హుండీ ద్వారా రూ. 25,364, గోసంరక్షణ విభాగం ద్వారా రూ. 19,903 వచ్చిందన్నారు. మొత్తం 62 రోజులకు పైనగదుతో పాటు 12 గ్రాముల 750 మిల్లీ గ్రాముల బంగారు, 142 గ్రాముల వెండి లభించిందన్నారు. 100 ఒమన్ బైంసాలు, 26 అమెరికా డాలర్లు, యూఏఈ, మలేషియా కరెన్సీ వచ్చినట్లు వివరించారు.
వర్షం కోసం దువా
శిరివెళ్ల: వర్షం కోసం శిరివెళ్లకు చెందిన వేలాది మంది ముస్లింలు శనివారం దువా చేశారు. జమియత్– ఉల్– ఉలేమా, షూరా జమాత్ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న బీడు భూమిని ఇందుకు ఎంచుకున్నారు. మూడు రోజుల పాటు వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు, దువా చేస్తామని ముస్లింలు తెలిపారు.
కేసీకి నీటి విడుదల బంద్
జూపాడుబంగ్లా: గణేశ్ నిమజ్జనం ముగియటంతో ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల ద్వారా కేసీ కాల్వకు పంపింగ్ చేస్తున్న నీటిని శనివారం సాయంత్రం బంద్‌చేశారు. జూపాడుబంగ్లా క్రాస్‌రెగ్యులేటర్ గేట్లను అధికారులు మూయడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత పదిరోజుల నుంచి కేసీ కాల్వలో నీటి ప్రవాహం కొనసాగటంతో కొంత మంది రైతులు మినుము, జొన్న తదితర ఆరుతడి పంటలను సాగుచేసుకొనేందకు సన్నద్ధమయ్యారు. అయితే రబీ పంటలు సాగుచేసుకొనేందుకు సాగునీరు సరఫరా చేస్తారా లేదా అనే విషయమై జిల్లా అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీలు స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయమై కేసీ కాల్వ ఏఈ శ్రీనివాసనాయక్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముచ్చుమర్రి నుంచి నీటిపంపింగ్‌ను నిలిపివేశామన్యానరు. క్రాస్‌రెగ్యులేటర్ గేట్లు మూసి సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. రబీసీజన్‌కు సాగునీటి సరఫరా విషయం ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.


