మినుము రైతు కుదేలు! | - | Sakshi
Sakshi News home page

మినుము రైతు కుదేలు!

Sep 9 2026 3:22 AM | Updated on Sep 9 2026 3:22 AM

కోవెలకుంట్ల: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ రైతులకు కలిసిరాలేదు. వివిధ పంటలపై ఎల్‌నినో పంజా విసరడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. మినుము రైతు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎకరాకు బస్తా దిగుబడి కూడా రాని పరిస్థితి. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 10,188 హెక్టార్లలో మినుము సాగు చేయాల్సి ఉండగా ఆయా మండలాల పరిధిలో 12,451 హెక్టార్లలో సాగైంది. జిల్లాలో అత్యధికంగా ఆళ్లగడ్డ మండలంలో 2,464 హెక్టార్లలో, గోస్పాడు మండలంలో 2,300, దొర్నిపాడు మండలంలో 3,075, శిరువెళ్ల మండలంలో 1,070 హెక్టార్లలో సాగైంది. సేద్యాల, విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఇప్పటి వరకు ఎకరాకు రూ. 18 వేల నుంచి రూ. 20 వేలకు పైగా వెచ్చించారు. పైరు చేతికందే వరకు వర్షాలు కురియకపోవడం, ఎండలు అధికం కావడం, విపరీతమైన గాలులు వీస్తుండటంతో పైరులో ఎదుగుదల ఆగిపోయింది. పైరు పూతకు రావాల్సి ఉండగా ఎండిపోతుండటంతో వేలాది ఎకరాల్లో పైరును దున్ని వేసి నష్టాలు చవి చూశారు.

ఎకరాకు అరబస్తా దిగుబడులు

గత ఏడాది మినుము సాగుతో నష్టాలు మూటగట్టుకున్న రైతులు ఈ ఏడాది ఆ నష్టాన్ని పూడ్చుకుందామని భావించి సాధారణ విస్తీర్ణాన్ని మించి మినుము పంట సాగు చేశారు. విత్తనం వేసినప్పటి నుంచి వరుణుడు ముఖం చాటేయడం, సాగునీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. బోర్లు, ఇతర సాగునీటి వనరులు అందుబాటులో ఉన్న రైతులు ఎకరాకు రూ. 6 వేల నుంచి రూ. 8 వేలు వెచ్చించి రెండు, మూడు తడులు సాగునీరు మళ్లించినా ప్రకృతి ప్రతికూల పరిస్థితులతో ప్రయోజనం లేకుండా పోయింది. ఎకరాకు కనీసం మూడు నుంచి నాలుగు బస్తాల దిగుబడులు వస్తాయనుకుంటే ప్రకృతి అనుకూలించకపోవడంతో ఎకరాకు అరబస్తా దిగుబడులు మాత్రమే రావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల పిచికారీ, కలుపు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో వేలాది రూపాయలు వెచ్చించారు. వర్షాభావ పరిస్థితులతో దిగుబడులు భారీగా తగ్గి పెట్టుబడులు నేలపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైరుకోసం పెట్టిన పెట్టుబడిలో కనీసం ఒక భాగం దిగుబడులు కూడా రాకపోవడంతో దిగాలు చెందుతున్నారు. సొంత పొలాలు ఉండి మినుము సాగు చేసిన రైతులు పెట్టుబడుల రూపంలో నష్టపోగా కౌలుకు తీసుకుని సాగు చేసిన కర్షకులకు ఎకరాకు రూ. రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు నష్టం వాటిల్లడంతో లబోదిబోమంటున్నారు.

వెంటాడిన వర్షాభావం

జిల్లాలో 12,451 హెక్టార్లలో

సాగైన మినుము

పెట్టుబడి ఎకరాకు

రూ. 20వేల పై మాటే

ప్రారంభమైన కోత, నూర్పిడి పనులు

ఎకరాకు బస్తాలోపే దిగుబడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement