కూటమి నిర్లక్ష్యంతోనే కరువు | - | Sakshi
Sakshi News home page

కూటమి నిర్లక్ష్యంతోనే కరువు

Aug 23 2026 12:22 AM | Updated on Aug 23 2026 12:22 AM

బండిఆత్మకూరు: కూటమి ప్రభుత్వం ఎల్‌నినో ప్రభావాన్ని బూచిగా చూపుతూ సాగునీరు విడుదల చేయకుండా కరువును తెచ్చిందని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. శ్రీశైల జలాశయం పూర్తి స్థాయిలో నిండినా రాయలసీమ సాగునీటి ప్రాజెక్ట్‌లకు నీటిని విడుదల చేయక పోవడం వెనుక ఆంతర్యమేమిటో అని ప్రశ్నించారు. శనివా రం ఆయన ఈర్నపాడు, లింగాపురం, పార్నపల్లి గ్రామాల్లో పర్యటించి సాగునీరు అందక ఎండుతున్న పంటలను పరిశీలించారు. నష్టపోతున్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈర్న పాడు గ్రామ శివారులో బీటలు వారిన వరి పంటను పరిశీలించి చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన పార్నపల్లి గ్రామంలోని టీటీడీ కల్యాణ మండపంలో రైతులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగంపై చూపుతున్న వివక్షను వివరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో శ్రీశైలం జలాశయం నిండినా తెలంగాణకు నీళ్లు.. రాయలసీమకు కన్నీళ్లే అన్నట్లుగా పరిస్థితి నెలకొందన్నారు. రైతులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో దాదాపు 170 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఎల్‌నినోతో ఏం సంబంధమని ప్రశ్నించారు. ఎల్‌నినో.. ఎల్‌నినో అని విపరీత ప్రచారం చేసి శ్రీశైలం ప్రాజెక్ట్‌ నీటిని విడుదల చేయకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో ప్రతిరోజూ నాలుగు టీఎంసీల నీటిని తరలిస్తుంటే కూటమి ప్రభుత్వ కళ్లు మూసుకుందని విమర్శించారు. మండలంలో దాదాపుగా 6 వేల హెక్టార్లలో రైతులు వరి సాగు చేస్తున్నారని, రైతులు ఇప్పటికే ఎకరాకు రూ. 15 నుంచి 20 వేల వరకు పెట్టుబడి పెట్టి నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారన్నా రు. ప్రభుత్వం, అధికారులు స్పందించి సాగునీరు ఇవ్వకపోతే రైతులకు ఆత్మహత్యే శరణ్యమన్నారు. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని, ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో ఈనెలాఖరులో 500 ట్రాక్టర్ల్లతో రైతులను తరలించి వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

రైతు వ్యతిరేకిగా మిగిలిపోతారు..

రైతు కష్టాలను విస్మరిస్తున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి చరిత్రలో రైతు వ్యతిరేకిగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడుతో గొడవపడి తెలుగుగంగ ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకుంటారేమో అని ఎదు రు చూస్తే నిరాశే మిగిల్చారన్నారు. శిల్పా వెంట ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు విజయ భాస్కర్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకట రామిరెడ్డి, రామ సుబ్బారెడ్డి, వైస్‌ ఎంపీపీ రమణ, నాయకులు గోపాల్‌ రెడ్డి, బాలీశ్వర్‌ రెడ్డి, బూరుగయ్య, గోపిరెడ్డి వెంకట రెడ్డి, లక్ష్మీకాంత రెడ్డి, విష్ణు, జగన్‌ మోహన్‌ రెడ్డి, శివ లింగం పాల్గొన్నారు.

శ్రీశైలం డ్యామ్‌లో నీరున్నా

ఎందుకు విడుదల చేయరు

రైతుల కన్నీరు రాష్ట్రానికి

మంచిది కాదు

మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement