వినాయక చవితి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

వినాయక చవితి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

Aug 23 2026 12:22 AM | Updated on Aug 23 2026 12:22 AM

నంద్యాల(అర్బన్‌): వచ్చే నెలలో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పా ట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై జిల్లా ఎస్పీ సునీల్‌షోరణ్‌, డీఆర్‌ఓ రాము నాయక్‌తో కలిసి కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఇటీవల కలెక్టరేట్‌ నుంచి 2,500 మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పర్యావరణహిత వినాయక చవితి నిర్వహణకు ప్రజలను ప్రోత్సహించాలన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పెద్ద విగ్రహాల నిమజ్జనానికి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని, ఈ మేరకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జన ఊరేగింపుపై ప్రత్యేక దృష్టి సారించాల ని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, స్థానిక సమస్యల పరిష్కారం, రాబోయే పండుగలు, కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు కార్యాచరణ రూపొందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో కలిసి కాలుష్యరహిత వినాయక చవితి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వీబీఆర్‌లో 4.753 టీఎంసీలు

వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (వీబీఆర్‌)లో నీటి నిల్వ 4.753 టీఎంసీలకు చేరింది. శనివారం ఉదయం 6 గంటల సమయానికి రిజర్వాయర్‌ నీటిమట్టం 255.32 మీటర్లు (837.66 అడుగులు)గా నమోదైంది. ప్రస్తుతం టీజీపీ లింక్‌ కాలువ ద్వారా వీబీఆర్‌కు 2,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. క్యాచ్‌మెంట్‌ ప్రాంతం నుంచి ఎలాంటి ప్రవాహం లేదని అధికారులు తెలిపారు. రిజర్వాయర్‌ నుంచి సగటున 250 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లో ఉండగా.. వెలుగోడు, ఆత్మకూరు, నంద్యాల పట్టణాల తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. 1ఎల్‌, 1ఆర్‌, టీజీపీ ప్రధాన కాలువలకు ప్రస్తుతం నీటి విడుదల లేదు.

మల్యాల నుంచి కేసీకి నీటి పంపింగ్‌ నిలిపివేత

జూపాడుబంగ్లా: మల్యాల ఎత్తిపోతల నుంచి కేసీ కాల్వకు సాగునీటి సరఫరా నిలిపివేశామని కేసీ కాల్వ ఏఈ శ్రీనివాసనాయక్‌ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మల్యాల ఎత్తిపోతల పథకం ఓ పంపు ద్వారా 338 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాల నిమిత్తం వారం రోజులపాటు కేసీకాల్వకు పంపింగ్‌ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. వారం రోజుల్లో మల్యాల నుంచి కేసీ కాల్వకు 0.2 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేసినట్లు తెలిపారు. ఈ నీటిని నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులను నింపినట్లు తెలిపారు.

ఏసీబీ అధికారులమని

లంచం అడిగితే ఫోన్‌ చేయండి

కర్నూలు: ఏసీబీ అధికారులమని బెదిరింపు కాల్స్‌ వస్తే వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1064కి కానీ, 9440446178 సెల్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ సీతారామ రావు తెలిపారు. శనివారం ఎ.క్యాంప్‌లోని ఏసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేస్తున్న ఫిర్యాదులు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయన్నారు. కర్నూలు మున్సిపల్‌ కార్యాలయంలో ఏఈగా పనిచేసి పదవీ విరమణ పొందిన వ్యక్తి ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నాడని, ఇదే తరహాలో అజ్ఞాత వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరించి రూ.2 లక్షలు వారి ఖాతాకు బదిలీ చేయించుకున్న ఘటనపై ఫిర్యాదు వచ్చిందన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల వ్యాపారులు, ఉద్యోగులు ఇలాంటి బెదిరింపు కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డబ్బులు ఇవ్వకపోతే రైడ్‌ చేసి జైలుకు పంపుతామని బెదిరిస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని ఆయన వెల్లడించారు. విలేకరుల సమావేశంలో సీఐలు కృష్ణయ్య, రాజప్రభాకర్‌, శ్రీనివాసులు, విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement