ఖరీఫ్ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్పిందే
కర్నూలు సిటీ: జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతానికి తాగునీటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుబాటులోని నీటిలో కనీసం ఆరుతడి పంటలకు ఏ మేరకు నీరిచ్చేందుకు సాధ్యమవుతుందో పరిశీలిస్తామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కర్నూలు జిల్లా సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. జెడ్పీ చైర్మెన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి, జల వనరుల శాఖ ఎస్‌ఈ శైలేశ్వర్, ఎల్‌ఎల్‌సీ ప్రాజెక్టు చైర్మన్ టిప్పు సుల్తాన్, డీసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని.. 22 మండలాల్లో లోటు వర్షపాతం ఉందన్నారు. ముందస్తు అవగాహన కార్యక్రమాలతో ఈ ఏడాది జిల్లాలో పంటల సాగుతో గణనీయమైన మార్పు కనిపిస్తోందన్నారు. తుంగభద్ర దిగువ కాలువకు నీటి లభ్యత అంచనా ప్రకారం 11.955 టీఎంసీల నీటి వాటా వచ్చిందని, ఇందులో ఇప్పటికే 1.5 టీఎంసీల నీరు వినియోగించుకోగా, ఇంకా 10.455 టీఎంసీ కోటా ఉందన్నారు. ఇందులో 4.5 టీఎంసీలు తాగునీటికి, 6 టీఎంసీలు సాగునీటికి, ఇది కూడా సాగులోని ఆరుతడి పంటలకు అందించేందుకు ఇన్‌చార్జి మంత్రి, జిల్లా కలెక్టర్‌తో చర్చించి మూడు, నాలుగు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. సమావేశంలో ఆరు అంశాలపై తీర్మానం చేశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. హంద్రీనీవా నీటి విషయంలో మొదటి నుంచి జిల్లాకు అన్యాయం జరుగుతోందన్నారు. లద్దగిరి సమీపంలోని స్లూయిస్ నుంచి 150 క్యూసెక్కుల నీరు హంద్రీనదిలోకి విడుదల చేయాలన్నారు. నదిలో నీరు లేక తీర గ్రామాల్లోని బోర్లు ఎండి పోయి తాగునీటికి కోడుమూరు, కల్లూరు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గతేడాది 52 టీఎంసీలకుపైగా నీరిచ్చామని చెబుతున్నా ఉలిందకొండ చెరువుకు, తడకనపల్లె చెరువుకు నీళ్లు ఇవ్వలేదన్నారు. టీబీ డ్యాం గేట్ల మార్పుతో గతేడాది ఎల్‌ఎల్‌సీ ఆయకట్టుదారులు రబీ సాగు కోల్పోయారని.. ఈ ఏడాది ఎల్‌ఎల్‌సీ కా ల్వ నీటిపై ఆశతో సాగు చేసిన ఆరుతడి పంటలకైనా నీళ్లివ్వాలని ఎల్‌ఎల్‌సీ ప్రాజెక్టు చైర్మెన్ కోరారు.
ఐఏబీకి గైర్హాజరైన మంత్రి,
ఎంపీ, కూటమి ఎమ్మెల్యేలు
సాగునీటి సలహా మండలి అధికారిక సమావేశంలో టీడీపీకి చెందిన ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతిని స్టేజిపై కూర్చోబెట్టడం విమర్శలకు తావిస్తోంది. స్టేజీపై ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తిని ఓ వైపు చివరలో కూర్చోబెట్టి.. టీడీపీ మినహా ఏ అఽధికారిక హోదా లేని వైకుంఠం జ్యోతికి పెద్దపీట వేయడం చూస్తే అధికారులు ఏ స్థాయిలో అధికార పార్టీకి తలొగ్గి పని చేస్తున్నారో అర్థమవుతోంది. ఇకపోతే ఇంతటి కీలక సమావేశానికి జిల్లా మంత్రి టీజీ భరత్, ఎంపీ, కూటమి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చూస్తే జిల్లా రైతాంగంపై వారికున్న ప్రేమ ఏపాటిదో తెలుస్తోంది.
తుంగభద్ర డ్యాంలోకి ఇప్పటి వరకు 100 టీఎంసీల నీరు రాగా.. ప్రస్తుతం 94.742 టీఎంసీల నీరు ఉంది. ఈ నీటిలో తాగునీటికి పోగా, మిగిలిన నీటితో ఖరీఫ్‌లో సాగు చేసిన చివరి ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సిందే. హంద్రీనీవా కాలువ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటిని ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన స్లూయిజ్‌ను పెంచాలి. హంద్రీనదిపై అనుకూలమైన చోట్ల చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మించేందుకు తీర్మానం చేయాలి. నీటి ఎద్దడి నెలకొన్న సమయంలో ఈ రిజర్వాయర్లను హంద్రీనీవా నీటితో నింపుకునేందుకు అవకాశం ఉంటుంది. తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టును చేపట్టేందుకు ఐఏబీలో తీర్మానం చేయాలి.
– ఎర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీ చైర్మన్
ఆరుతడి పంటలకు సాగునీటి
విడుదలపై పరిశీలన
జిల్లా సాగునీటి సలహా మండలి
సమావేశంలో ఇన్‌చార్జ్ కలెక్టర్ నూరల్ ఖమర్


