● 24న పోతిరెడ్డిపాడు సందర్శన
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కాటసాని రాంభూపాల్‌రెడ్డి
కల్లూరు: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగునీరు విడు దల చేయకుండా రైతులను మోసం చేస్తే సహించేది లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఆయన తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడు తూ.. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఎస్సార్బీసీకి నీటిని విడుదల చేస్తే పాణ్యం, బనగానపల్లె మండలాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుందన్నారు. భూగర్భ జలాలు సైతం పెరుగుతాయన్నారు. కూటమి ప్రభుత్వం జీఎన్‌ఎస్‌ఎస్ ద్వారా అవుకు రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తుండటంతో జిల్లా ప్రజలకు ఉపయోగం ఉండదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందించకుండా తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. హంద్రీనీవా నీటితో జిల్లాలోని చెరువులను ముందుగా నింపాలని డిమాండ్ చేశారు.
ఎస్సార్బీసీకి నీరు విడుదల చేయించాలి..
ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి వెంటనే గోరుకల్లు నుంచి ఎస్సార్బీసీకి నీటిని విడుదల చేయించాలని కాటసాని కోరారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి గాలేరు – నగరికి ఏ విధంగా నీటిని అందిస్తున్నారో అదే విధంగా ఎస్సార్బీసీకి కూడా నీటిని విడుదల చేస్తే తాగు, సాగు నీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిని తెలంగాణ ప్రభుత్వం ప్రతిరోజూ మోటార్ల ద్వారా తరలించడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. జిల్లా మంత్రులు తక్షణమే స్పందించి సాగునీటి విడుదల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కూటమి ప్రభుత్వం మొద్దునిద్ర వీడి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద పరిస్థితిని తెలుసుకునేందుకు సోమవారం మాజీ మంత్రి శైలజానాథ్‌తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులంతా కలిసి వెళ్తున్నామన్నారు.


