వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిపై అక్రమ కేసు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిపై అక్రమ కేసు

Aug 19 2026 1:18 AM | Updated on Aug 19 2026 1:18 AM

మీ ఇంటిని ఇలాగే ఉంచుతారా?

కర్నూలు: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌పై కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అక్రమ కేసు నమోదైంది. ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షిని అక్రమ కేసులో అరెస్టు చేసి కర్నూలు జిల్లా జైలులో ఉంచారు. ఆయనతో ములాఖత్‌ కావడానికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 13న కర్నూలు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం బీసీలను అణగదొక్కుతోందంటూ సుభాష్‌ చంద్రబోస్‌ ఆధ్వర్యంలో కర్నూలు బళ్లారి చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అయితే ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారంటూ నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ జి.సుబ్బరాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 189(2), 126(2), 287, 125 రెడ్‌విత్‌ 190 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా

బొమ్మలసత్రం: నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలంటే నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్‌ అధికారులకు ఎస్పీ సునీల్‌ షొరాణ్‌ సూచించారు. ఎస్పీ కార్యాలయంలోని సమావేశ భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌, మట్కా, గ్యాంబ్లింగ్‌ లాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను నివారించాలని ఆదేశించారు. ప్రజలను భయాందోళనకు గురిచేసేలా భౌతిక దాడులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నేరాలు జరిగిన నిమిషాల్లో నేరస్తులను గుర్తించాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ ఖాదర్‌బాషా, ఏఎస్పీ సుస్మిత, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్‌, రామాంజినాయక్‌, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

స్మృతివనంలో

‘త్రీడీ’ నల్లమల దర్శనం

ఆత్మకూరురూరల్‌: నల్లకాల్వ గ్రామ శివారులోని వైఎస్సార్‌ స్మృతివనం సందర్శనకు వచ్చే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగించే సౌకర్యం ఒకటి కొత్తగా ప్రారంభించారు. త్రీడీ ఎఫెక్ట్‌తో ఉండే కళ్లజోడులో నల్లమల అడవిని చిత్రీకరించిన వీడియోలను ఉంచారు. ఈ కళ్లజోడు ధరిస్తే మనం స్వయంగా నల్లమల అడవుల్లో సంచరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇందుకోసం కేవలం రూ.50 మాత్రమే చార్జ్‌ చేస్తున్నారు. ఈ సౌకర్యాన్ని ఆత్మకూరు అటవీ డివిజన్‌ డిడి విగ్నేష్‌ అపావ్‌ సోమవారం స్వయంగా పరిశీలించారు.

వైద్య సిబ్బందిపై డీసీహెచ్‌ఎస్‌ ఆగ్రహం

బేతంచెర్ల: ‘రోగుల బెడ్లు ఇలాగేనా ఉండేది.. మీ ఇంటిని ఇలాగే ఉంచుతారా’ అంటూ వైద్య సిబ్బందిపై డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బేతంచెర్లలోని శేషారెడ్డి సీహెచ్‌సీని మంగళవారం అమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అస్పత్రి అపరిశుభ్రంగా ఉండటం, రోగుల బెడ్లు సరిగ్గా లేకపోవడంతో సిబ్బంది తీరుపై మండిపడ్డారు. క్యాజువాలిటీ, కాన్పుల వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అస్పత్రి పరిసరాలు, వార్డులు, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణుల కోసం స్కానింగ్‌, ఎక్సేర్‌ పరీక్షలు ఎక్కడ అందుబాటులో ఉంటాయో అస్పత్రిలో స్పష్టంగా రాసి ఉంచాలని సూచించారు. వైద్యులు వాణి స్వప్నప్రియ, వెంకటేశ్వర్లు, విజయా భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement