వైఎస్‌ జగన్‌ జనంలోకి వస్తే ఎలా ఉంటుందో కర్నూలు పర్యటన చాటింది. పోలీసుల ఆంక్షలు.. అడుగడుగునా అడ్డంకులు.. ఎక్కడికక్కడ నాయకులు, కార్యకర్తలు కర్నూలుకు చేరుకోకుండా నిలువరించారు. ఎయిర్‌పోర్టు దాటి అభిమాన నేత కారులో బయటకు రాగానే ఊళ్లకు ఊళ్లు దారి పొడవునా ఎదురేగి | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ జనంలోకి వస్తే ఎలా ఉంటుందో కర్నూలు పర్యటన చాటింది. పోలీసుల ఆంక్షలు.. అడుగడుగునా అడ్డంకులు.. ఎక్కడికక్కడ నాయకులు, కార్యకర్తలు కర్నూలుకు చేరుకోకుండా నిలువరించారు. ఎయిర్‌పోర్టు దాటి అభిమాన నేత కారులో బయటకు రాగానే ఊళ్లకు ఊళ్లు దారి పొడవునా ఎదురేగి

Aug 14 2026 7:44 AM | Updated on Aug 14 2026 7:44 AM

చంద్రబాబుకు నిద్ర పట్టదు ఆంక్షలతో అభిమానాన్ని నిలువరించలేరు

బళ్లారి చౌరస్తా వద్ద జన ప్రవాహం

సాక్షి ప్రతినిధి, కర్నూలు/కర్నూలు సెంట్రల్‌: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కర్నూలు పర్యటన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో మరింత ఊపు తెచ్చింది. అందరిలోనూ రెట్టించిన ఉత్సాహం నింపింది. చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడంతో కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు గురువారం ఉదయం 11 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి వైఎస్‌ జగన్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి రాక్‌గార్డెన్‌, నన్నూరు టోల్‌ ప్లాజా, టీవీ9 ప్రజానగర్‌, వెంగన్న బావి, రిజిస్ట్రార్‌ ఆఫీస్‌, చెన్నమ్మ సర్కిల్‌, బళ్లారి చౌరస్తా, బాలాజీ నగర్‌, సంతోష్‌ నగర్‌, పంచలింగాల చెక్‌పోస్టు మీదుగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జిల్లా జైలుకు చేరుకున్నారు. మొత్తం 38 కిలోమీటర్ల ప్రయాణానికి ఐదు గంటల సమయం పట్టింది.

అడుగడుగునా నిర్బంధం

సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని వైఎస్‌ జగన్‌ కలిశారు. అరగంట పాటు విరూపాక్షితో పాటు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. తానున్నానంటూ భరోసా ఇచ్చారు. అనంతరం బయటకు వచ్చిన జగన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆలూరు ఎమ్మెల్యేపై అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టిన చంద్రబాబు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే అని చూడకుండా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి అని చూడకుండా తనను జైలులో అధికారులు నిలబెట్టి ఫొటోలు తీసి అవమానించారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇంతకింత అనుభవించక తప్పదని హెచ్చరించారు. దాదాపు అరగంట పాటు జగన్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. అప్పటికే వేలాదిమంది కార్యకర్తలు జైలు వద్దకు తరలివచ్చారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు అడుగడుగునా నిర్బంధం విధించినా జనం వెనుకడుగు వేయలేదు. జై జగన్‌ నినాదాలతో జిల్లా జైలు ప్రాంతం హోరెత్తింది. జగన్‌ వెళ్లేవరకు కార్యకర్తల్లో జో ష్‌ తగ్గలేదు. జెండాలు చేతబూని చిందులు తొక్కారు.

పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెంట వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్వీ విజయ మనోహరి, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి, సాయిప్రసాద్‌ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కంగాటి శ్రీదేవి, గంగుల బిజేంద్రనాథ్‌ రెడ్డి, మణిగాంధీ, హఫీజ్‌ ఖాన్‌, మాజీ మేయర్‌ బీవై రామయ్య, కర్నూలు నియోజకవర్గ పరిశీలకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్‌ అలీఖాన్‌, ఎస్‌ఈసీ మెంబర్‌ కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌, తెర్నెకల్‌ సురేందర్‌ రెడ్డి, సమన్వయకర్తలు ఆదిమూలపు సతీష్‌, దారా సుధీర్‌ పాల్గొన్నారు.

ఎన్ని నిర్బంధాలు పెట్టినా.. పోలీసులు అడ్డుకున్నా.. జగనన్న కోసం ప్రజలు సునామీలా తరలి వచ్చారు. జగనన్న జిల్లా పర్యటన విఫలం చేయాలని టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా చంద్రబాబు పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం కలగలేదు. 1300 మంది పోలీసు అధికారులను, పోలీసులను నియమించి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయినా ప్రజలు, మహిళలు, యువకులు ఊహించని స్థాయిలో బ్రహ్మరథం పట్టారు. జగనన్న కోసం వచ్చిన జనాలను చూసి చంద్రబాబుకు నిద్ర పట్టదు. ప్రజలు అక్రమ కేసులకు భయపడరన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.

– ఎస్వీ మోహన్‌ రెడ్డి,

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు

జగనన్నను చూసేందుకు తరలివస్తున్న ఉమ్మడి జిల్లాల్లో పార్టీ నేతలు, అభిమానులు, ప్రజలను చెక్‌పోస్టులు పెట్టి అడ్డుకోవడం దారుణం. ఎంత కట్టడి చేస్తే అంతకు రెట్టింపు ప్రజలు వస్తారని ముందుగానే చెప్పాం. అన్నట్లుగానే అడుగడుగునా అభిమానులు నీరాజనం పలికారు. లక్ష మంది తరలి వచ్చారు. ఆంక్షలతో అభిమానాన్ని నిలువరించలేమని కూటమి ప్రభుత్వానికి తెలిసివచ్చింది. జగనన్న అంటే ఎందుకంత భయం. ప్రభుత్వ తీరు మారాలి.

– కాటసాని రాంభూపాల్‌ రెడ్డి,

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు

సైడ్‌లైట్స్‌

ఎయిర్‌పోర్ట్‌ నుంచి ముఖద్వారం వద్దకు చేరుకున్న వైఎస్‌ జగన్‌తో ఓ మైనార్టీ మహిళ కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు పక్కకు తోసేశారు. గమనించిన జగన్‌ సూచనలతో నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిశోర్‌ రెడ్డి ఆమెను అభిమాన నేత వద్దకు తీసుకొచ్చి కరచాలనం చేయించడంతో ఆమె ముఖంలో సంతోషం విరబూసింది.

నన్నూరు వద్ద భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఆ తరువాత నన్నూరు టోల్‌గేట్‌ దగ్గర వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కిగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జి దారా సుధీర్‌తో పాటు ఆ నియోజకవర్గ పరిశీలకులు బుడ్డా శేషిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేలాది మంది పార్టీ కార్యకర్తలు డప్పులతో స్వాగతం పలికారు.

ప్రజానగర్‌ వద్ద వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కుడా మాజీ చైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ఆదిమూలపు సతీష్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బంతిపూలు చల్లుతూ స్వాగతం పలికారు.

జగనన్నా మాకు మీరే దిక్కంటూ మెగా డీఎస్సీ–2025 స్పోర్ట్స్‌ కోటా, ఇతర కేటగిరీల్లో ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు ప్రజానగర్‌ దాటిన తరువాత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. మరికొంత మంది విద్యార్థులు సార్‌ మాకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావడం లేదని, ఫీజు చెల్లించలేకపోతున్నామని ప్లకార్డులు ప్రదర్శించారు.

హ్యాంగౌట్‌ వద్ద కానిస్టేబుల్‌ ఉద్యోగాలను 2,500 నుంచి 10 వేలకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరుతూ కానిస్టేబుల్‌ అభ్యర్థులు ప్లకార్డులను ప్రదర్శించారు.

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్‌ రైటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయంపై మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.

ఆటోనగర్‌ వద్ద తమ అభిమాన నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని చూసిన ఆనందంతో ఓ రైతు తన టవల్‌ను అందించగా.. ఆ టవల్‌తో జగన్‌మోహన్‌ రెడ్డి ఫ్యాన్‌లా గిరగిరా తిప్పుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

– కర్నూలు సిటీ

హైవేలో జన సునామీ!

ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి మాజీ ముఖ్యమంత్రిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చి కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. పార్టీ శ్రేణులతో పాటు రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా తరలివచ్చారు. జై జగన్‌, సీఎం జగన్‌, కాబోయే సీఎం జగన్‌.. అంటూ నినాదాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ జెండాలతో చిందులు తొక్కారు. భారీగా వచ్చిన జనంతో కర్నూలు కిక్కిరిసిపోయింది. హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారిలో భారీ జన సందోహం మధ్య కాన్వాయ్‌ ముందుకు వెళ్లడానికి వీలు కాలేదు. దీంతో జిల్లా జైలుకు చేరేందుకు ఐదు గంటల సమయం పట్టింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. అన్ని వర్గాల ప్రజల్లో ఉత్సాహం కనిపించింది.

జై జగన్‌ నినాదాలతో మార్మోగిన

సీమ ముఖద్వారం

మాజీ ముఖ్యమంత్రిని చూసేందుకు

ఎగబడ్డ ప్రజలు

జనసంద్రంగా మారిన కర్నూలు

38 కిలోమీటర్ల ప్రయాణానికి

ఐదు గంటల సమయం

వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో జోష్‌ నింపిన

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే

విరూపాక్షికి పరామర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement