బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ పరిశీలన

Aug 14 2026 7:44 AM | Updated on Aug 14 2026 7:44 AM

పాములపాడు: మండలంలోని బనకచర్ల క్రాస్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఉన్నత స్థాయి బృందం గురువారం పరిశీలించింది. కేంద్ర జల సంఘం ఎక్స్‌ అఫీషియో అదనపు కార్యదర్శి యోగేష్‌ పైతాంకర్‌ నేతృత్వంలో సీఈఓ ఆర్‌కే రెడ్డి, డైరెక్టర్‌ శంకర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ సంజీవ్‌తో కూడిన అధికారుల బృందం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. వారికి క్రాస్‌ రెగ్యులేటర్‌ పరిధిలోని గేట్ల పనితీరు, నీటి విడుదల వ్యవస్థ గురించి ఈఈ శంకర్‌ రెడ్డి, డీఈ నగేష్‌ వివరించారు. బనకచర్ల నుంచి కేసీ కెనాల్‌, తెలుగుగంగ, ఎస్సార్‌బీసీ, గాలేరు–నగరి సుజల స్రవంతి కాలువలకు నీటి విడుదల వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. అలాగే అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం తెలుగుగంగ ప్రధాన కాలువ ద్వారా చైన్నె నగర తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్న నీటి సమాచారాన్ని సేకరించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకాలు, అనుసంధాన కాలువల ద్వారా బనకచర్ల రెగ్యులేటర్‌కు నీటిని చేర్చే మార్గాలు, సాంకేతిక అంశాలు, డిజైన్లను ఇరిగేషన్‌ పీపీఎం ఈఈ రామకోటయ్య అధికారులతో కలిసి మ్యాప్‌ల ద్వారా విశ్లేషించారు. కరువు పీడిత రాయలసీమ జిల్లాల తాగు, సాగునీటి అవసరాలను శాశ్వతంగా తీర్చేందుకు ఈ అనుసంధానం ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశంపై అధికారులతో విస్తతంగా చర్చించారు. వారి వెంట ఏఈలు దేవేంద్ర , విశ్వనాధ్‌, విష్ణువర్ధన్‌ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement