శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయాన్ని బుధవారం సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యుడు యోగేష్ పైతాంకర్ సందర్శించారు. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో శ్రీశైలం డ్యాంకు వస్తున్న వరదనీరు, సెల్ఫ్ క్యాచ్‌మెంట్‌లో వర్షపాతం, శ్రీశైలం ఆధారిత ప్రాజెక్ట్‌లకు విడుదల చేస్తున్న వరదనీరు, విద్యుత్ ఉత్పాదన, డ్యాం పటిష్టత, భద్రత వంటి అంశాలపై డ్యాం ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు చీఫ్ ఇంజినీర్ ఓఆర్‌కే రెడ్డి, డైరెక్టర్ కే శంకర్, అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ సంజీవ్, డ్యాం ఇంజనీర్లు వేణుగోపాల్‌రెడ్డి, రవికుమార్, తిప్పేస్వామి తదితరులు ఉన్నారు.
భక్తిశ్రద్ధలతో శ్రీ చౌడేశ్వరిదేవి జయంత్యుత్సవం
బనగానపల్లె రూరల్: శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి జయంత్యుత్సవాన్ని బుధవారం నందవరం గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం చేశారు. చండీహోమం అనంతరం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో అధిష్టింపజేశారు. శాస్త్రోక్తంగా పల్లకి సేవ, సహస్త్ర దీపాలంకరణ జరిపారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.
జాతీయ ఉపకారవేతన ఫలితాల విడుదల
నంద్యాల(న్యూటౌన్): గతేడాది నిర్వహించిన జాతీయ ఉపకారవేతన ఫలితాలు విడుదలైనట్లు నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి ిజనార్దన్ రెడ్డి తెలిపారు. వివరాలు ప్రభుత్వ కార్యాలయ వెబ్‌సైట్ www.bse.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఎంపిక అయిన విద్యార్థులు వెంటనే బ్యాంకు అకౌంట్ తెరిచి, ఆధార్‌ను లింక్ చేయించి, డీబీటీ ద్వారా డబ్బులు జమయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. వివరాలు తనిఖీ చేసుకొని విద్యా మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారి స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships. gov.inలో నమోదు చేసుకొని దరఖాస్తును సబ్మిట్ చేయాలని తెలిపారు.
183 టీఎంసీల నీటినిల్వలు
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలో బుధవారం సాయంత్రానికి 183.4198 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. రెండు రోజులుగా జూరాల నుంచి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. బుధవారం జూరాల నుంచి 83,161 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. డ్యామ్ నీటిమట్టం 879.10 అడుగులకు చేరుకుంది. మంగళవారం నుంచి బుధవారం వరకు దిగువ ప్రాజెక్ట్‌లకు శ్రీశైలం నుంచి 41,118 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో 13.627 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి 26,052 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 10 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 3,050 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,016 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
మార్కెట్ యార్డులో
ఇసుక దందా!
బండిఆత్మకూరు: ప్రభుత్వ ఆధీనంలోని బండిఆత్మకూరు మార్కెట్ యార్డును టీడీపీ నాయకులు ఇసుక నిల్వ కేంద్రంగా మార్చుకున్నారు. ప్రజా అవసరాలకు కోసం ఽఉద్దేశించిన ప్రభుత్వ స్థలంలో వేల టన్నుల ఇసుక నిల్వ చేయడానికి అనుమతులు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ తతంగం కొన్ని నెలలుగా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


