● రద్దీ రోజుల్లో ఆర్జిత అభిషేకాలు
నిలుపుదల
● మూడు శుక్రవారాల్లో ఉచితంగా
సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం నుంచి సెప్టెంబరు 12వ తేదీ వరకు శ్రావణమాసోత్సవాలు జరుగనున్నాయి. శ్రావణమాసంలో ప్రతిరోజు వేకువజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరచి ప్రాతఃకాలపూజలు చేస్తారు. ఉభయదేవాలయాల్లో 4.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆలయ శుద్ధి అనంతరం సాయంత్రం 5.30 గంటల నుంచి దర్శనాలు కొనసాగుతాయి. భక్తుల సౌకర్యార్థం ఈ నెల 21న శ్రావణ రెండో శుక్రవారం, 28న మూడో శుక్రవారం, సెప్టెంబరు 4న నాల్గవ శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను దేవస్థానం నిర్వహిస్తుంది. శ్రావణమాసం మొత్తం 19 రోజుల్లో గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు పూర్తిగా నిలుపుదల చేశారు. అలాగే ఉదయాస్తమానసేవ, ప్రాతఃకాలసేవ, ప్రదోషకాలసేవ పూర్తిగా నిలుపుదల చేశారు. ధర్మప్రచారంలో భాగంగా శ్రావణమాసంలో గురువారం నుంచి అఖండశివభజనలను నిర్వహించనున్నారు.


