నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 13వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
వైఎస్సార్ హయాంలో భజంత్రీల నియామకం
మహానంది: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వేలాది మంది భజంత్రీలను ఆలయాల్లో నియమించారని టీటీడీ ఆస్థాన విద్వాంసకులు, పద్మశ్రీ డాక్టర్ యల్లా వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన మహానందీశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధర్మోరక్షిత రక్షితః అంటూ ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ధర్మమే రక్షిస్తుందన్నారు. కళాకారులు సౌభాగ్యంగా ఉంటే రాష్ట్రం సౌభాగ్యంగా ఉంటుందన్నారు. దేవాయాలను అభివృద్ధి చేయడంతో పాటు యువతను సంగీతం, సాహిత్యం వైపు దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నేడు, రేపు
దస్తావేజులేఖరుల పెన్‌డౌన్
కర్నూలు(సెంట్రల్): ప్రైవేట్‌లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును నిరసిస్తూ సోమ, మంగళవారాల్లో దస్తావేజుల పెన్‌డౌన్ ఉంటుందని దస్తావేజుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ఎస్‌ఏ రెహమాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జీఓ నంబర్ 396ను రద్దు చేయాలని కోరుతూ చేపట్టే పెన్‌డౌన్ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు. స్టాంప్స్‌అండ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్‌ను ప్రైవేట్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం పూనుకోవడం అన్యాయమన్నారు. అదే జరిగితే ఏళ్లుగా దస్తావేజు లేఖరులుగా పని చేస్తున్న వారు జీవన భృతిని కోల్పోతారన్నారు. ప్రభుత్వం వెంటనే తన ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, లేదంటే రాబోయే రోజుల్లో పోరాటాలను ఉద్ధృతం చేస్తామన్నారు.
సౌత్ జోన్ క్రికెట్ పోటీలకు పత్తికొండ విద్యార్థిని
పత్తికొండ రూరల్: వైజాగ్‌లో జూలై 15 వతేదీ నుంచి ప్రారంభం కానున్న సౌత్‌జోన్ పోటీలకు పత్తికొండ విద్యార్థిని ఎస్.ముబీనా ఎంపికయ్యారు. ఈనెల 5 నుంచి 11వరకు చిత్తూరు జిల్లాలో వాయల్‌పాడులో అండర్–19 అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీలో కర్నూలు జిల్లా జట్టుకు ముబీనా ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీల్లోనే ఆల్‌రౌండర్‌గానే కాకుండా, బౌలింగ్‌లో ఉత్తమ ప్రతిభతో 4 వికెట్లు తీశారు. గుంటూరులోని గొరవయ్య కాలేజీలో ఇంటర్మీడియెట్ సెకండియర్ చదువుతూ అక్కడే శుభం అసోసియేషన్ తరఫున క్రికెట్‌లో శిక్షణ తీసుకున్నారు. పత్తికొండలో తోపుడుబండి వ్యాపారం చేసుకుంటున్న తల్లి ఎం.ఖాజాబీ చిన్నతనం నుంచి తన కూతురుకు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తిని గమనించి విద్యార్థినిని ప్రోత్సహించారు. తమ కూతురు ముబీనా వైజాగ్‌లో జరిగే సౌత్‌జోన్ క్రికెట్ పోటీల్లో ఆడనుండటంపై తల్లి ఆనందం వ్యక్తం చేశారు.
రేపు ‘ఫ్యాప్టో’ ధర్నా
కర్నూలు(సెంట్రల్): ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 14న చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్ ప్రకాశరావు, కర్నూలు జిల్లా చైర్మన్ ఎం.మధుసూధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ..మంగళవారం ఉదయం 9 గంటలకు జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీని ఉంటుందన్నారు. కలెక్టరేట్ ఎదుట శాంతియుతంగా ధర్నా చేస్తామని తెలిపారు. ధర్నాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


