● రాష్ట్ర ఎంపీఈవోల సంఘం
అధ్యక్షుడు బసవరాజు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఎంపీఈవోలకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఆ సంఘం అధ్యక్షుడు బసవరాజు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఎన్‌జీవో హోమ్‌లో జిల్లా ఎంపీఈవోల సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఎంపీఈవోలు గత 12 ఏళ్లుగా రూ.12,000 వేతనంతోనే పని చేస్తున్నారన్నారు. మార్చి నుంచి జూన్ వరకు వేతనాలు అందలేదన్నారు. ఉద్యోగభద్రత లేదని, అనారోగ్య పరిస్థితులు ఉత్పన్నమైనా ఎటువంటి భీమా సదుపాయం లేదని పేర్కొన్నారు. జిల్లా ఎన్‌జీజీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంసీ కాశన్న మాట్లాడుతూ ఎంపీఈవోలకు ఏపీ ఎన్‌జీజీవోస్ అసోసియేషన్ అండగా ఉంటుందన్నారు. జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, మధుగౌడు, మల్లేష్, జిల్లా ఎన్‌జీవో అసోసియేషన్ నేతలు తిరుమలరెడ్డి, శ్రీరాములు, అనంతపురం, కర్నూలు, నంద్యాల, సత్యసాయి జిల్లాలకు చెందిన ఎంపీఇవోలు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
ఓర్వకల్లు: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై కాల్వబుగ్గ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని నన్నూరు గ్రామానికి చెందిన రాజన్న కొడుకు నాగరాజు (ఆటో డ్రైవర్) శనివారం బేతంచెర్లకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో కాల్వబుగ్గ కాకతీయ స్కూల్ ఎదురుగా నంద్యాల వైపు నుంచి వస్తున్న కారు ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఆటోలో ఉన్న దుర్గాపేటకు చెందిన లక్ష్మీదేవి (50) దుర్మరణం చెందగా, నన్నూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాగరాజు, మణెమ్మతో పాటు కారు డ్రైవర్ జైపాల్‌కు స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హైవే పెట్రోలింగ్ వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్‌ఐ సునీల్‌కుమార్ తెలిపారు.
వ్యభిచార గృహ నిర్వాహకులు అరెస్టు
కర్నూలు: కర్నూలు శివారులోని ఉల్చాల రోడ్డులో ఉన్న ఆదిత్య నగర్‌లో కొంతకాలంగా వ్యభిచార గృహం నడుపుతున్న కర్నూలుకు చెందిన ఆర్గనైజర్స్ వంశీకృష్ణ, రామకృష్ణతో పాటు ఆదోని పట్టణానికి చెందిన విటుడు భరత్‌ను నాల్గో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆదిత్య నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో జోరుగా వ్యభిచారం సాగుతున్నట్లు సమాచారం అందడంతో రెండు రోజుల క్రితం సీఐ విక్రమసింహ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ముగ్గురు మహిళలు, ముగ్గురు విటులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన సంగతి తెలిసిందే. నిర్వాహకులతో పాటు మరో విటుడు తప్పించుకుని పారిపోవడంతో శనివారం వారిని కూడా అదుపులోకి తీసుకుని సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
వెదురు కర్రల వాహనం స్వాధీనం
రుద్రవరం: నల్లమల అటవీ ప్రాంతంలో నుంచి వెదురు కర్రలను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని శనివారం అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రుద్రవరం రేంజి అధికారి ముర్తుజావలి తెలిపిన వివరాల మేరకు.. నల్లమల అడవి నుంచి వెదురు కర్రలు తరలిపోతున్నట్లు సమాచారం అందడంతో ఎఫ్‌ఎస్‌ఓలు, మాబుఖాన్, విజయవర్ధన్, మద్దిలేటిస్వామి, ఎఫ్‌బీఓలు సురేంద్రగౌడ్, నాగేష్ నిఘా ఉంచారు. శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల మీదుగా డబ్ల్యూ కొత్తపల్లె వైపు వెళ్లే దారిలో మాటు వేయగా వెదురు కర్రలను అక్రమంగా తరలించే బొలెరో వాహనం పట్టుబడిందన్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడు గాజులపల్లెకు చెందిన షేక్ నందిపల్లి మదార్ సాహెబ్‌ను అరెస్టు చేశామన్నారు. నిందితుడిపై అటవీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు రేంజర్ తెలిపారు.
మహానందిలో వీకెండ్ సందడి
మహానంది: మహానందిలో వీకెండ్ సందడి నెలకొంది. రెండో శనివారం, సెలవురోజు కలిసి రావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దర్శనం అనంతరం నంది సర్కిల్, పెద్ద నంది ప్రాంతాలను తిలకించి భక్తులు సేదతీరారు. భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు నిర్విరామ దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం కల్యాణ మండపంలో శ్రీ గంగ, కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి దంపతులకు కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి స్వామి, అమ్మవారికి యాగశాలలో ఏకాంత సేవ పూజలు జరిగాయి.


