రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇంట్లో చోరీ

Jul 12 2026 3:17 AM | Updated on Jul 12 2026 3:17 AM

కర్నూలు: కర్నూలులో రాత్రి, పగలు తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతున్నారు. సంతోష్‌ నగర్‌ శివారు విష్ణు టౌన్‌షిప్‌ వాటర్‌ ట్యాంకు వద్ద గూడూరు గోపాల్‌, ఉమాదేవి దంపతులు నివాసముంటున్నారు. గోపాల్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. రెండు రోజుల క్రితం ఆయన వ్యక్తిగత పని మీద హైదరాబాదుకు వెళ్లారు. ఆయన భార్య ఉమాదేవి శనివారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బెడ్‌రూమ్‌లోని అల్మారాలో దాచివుంచిన 12 తులాల బంగారు నగలు, అరకిలో వెండి ఆభరణాలు, రూ.1.20 లక్షల నగదు మూటగట్టుకుని ఉడాయించారు. ఉమాదేవి 2 గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. గదిలోకి వెళ్లి చూడగా అల్మారాలోని సామాన్లన్నీ చిందరవందరగా పడివుండటంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. నాల్గో పట్టణ ఎస్‌ఐ గోపీనాథ్‌ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. రెండో శనివారం కరెంటు లేకపోవడంతో ఇంట్లో సీసీ కెమెరాలు పనిచేయలేదు. క్లూస్‌టీమ్‌ను, ఫింగర్‌ ప్రింట్స్‌ సిబ్బందిని రప్పించి ఆధారాలను సేకరించారు. ఇంటి యజమానితో పాటు ఇరుగుపొరుగు వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆ ప్రాంతంలోని వ్యాపార సముదాయాల ఎదుట ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని కూడా సేకరిస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement