ఓట్లు తొలగించే కుట్రలను అడ్డుకుందాం | - | Sakshi
Sakshi News home page

ఓట్లు తొలగించే కుట్రలను అడ్డుకుందాం

Jul 6 2026 2:10 AM | Updated on Jul 6 2026 2:10 AM

● బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి ● ప్రతి ఓటరూ సరైన ధ్రువపత్రాలు సమర్పించాలి ● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

● బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి ● ప్రతి ఓటరూ సరైన ధ్రువపత్రాలు సమర్పించాలి ● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

గడివేముల: ఓటరు జాబితా ’ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్‌)లో ఓట్లు తొలగించే కుట్రలను అడ్డుకుందామని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. గడివేములలోని పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. ‘సర్‌’ ప్రక్రియ జాతీయ ఎన్నికల కమిషన్‌ చేపట్టినా టీడీపీ నాయకుల కుట్రలు ఉంటాయన్న విషయాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు, బీఎల్‌ఎలు గుర్తించుకోవాలన్నారు. దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ‘సర్‌’ ప్రభావంతో సీఎం అభ్యర్థులు సైతం ఓటమి పాలైన సంగతిని గుర్తు పెట్టుకోవాలన్నారు. టీడీపీ నాయకులు కుట్రలు పన్ని వైఎస్సార్‌సీపీ అనుకూల ఓట్లను సాంకేతిక కారణాలు చూపి తొలగిస్తున్నారనే వాదనలు ఉన్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

భూములు కోల్పోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం అందించండి

రెండేళ్ల కూటమి పాలనలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు సంక్షేమాన్ని కొనసాగించలేని అసమర్థులుగా, అవినీతిపరులుగా ముద్ర వేసుకున్నారన్నారు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో భూములు కోల్పోయామని న్యాయం జరిగేలా చూడాలని కాటసాని రాంభూపాల్‌రెడ్డి దృష్టికి కొర్రపోలూరు గ్రామానికి చెందిన కొంత మంది రైతులు తీసుకువచ్చారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేసేంత వరకు పోరాటాలు చేద్దామని రైతులకు హామీ ఇచ్చారు. సోలార్‌లో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం అందించేందుకు కృషి చేస్తామని కాటసాని రాంభూపాల్‌రెడ్డి తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు వైఎస్సార్‌సీపీ అండంగా ఉంటుందన్నారు. ఏ పేద రైతు నష్టపోకుండా తాము పోరాటానికై నా సిద్ధమన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ఆర్‌బీ చంద్రశేఖరరెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ మధుసూదన్‌, ఎంపీటీసీ సభ్యుడు మహేశ్వరరెడ్డి, నాయకులు దేశం నాగేశ్వరరెడ్డి, మాజీ మూలపెద్దమ్మ ఆలయ చైర్మన్‌ చిన్నన్న పాల్గొన్నారు.

చంద్రబాబు ఎత్తుగడలు

ప్రతి ఓటూ భవితకు మెట్టు అనే సంగతిని వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు గుర్తించాలన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమని, ఆ తరహా సంకేతాలు గమనించిన ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎత్తుగడలు అప్రజాస్వామికంగా ఉంటాయన్నారు. ఓటరు జాబితా తయారీలో అధికారులను ప్రలోభాలకు గురిచేసి తనకు అనుకూలంగా మార్చుకునే కుట్రకు చంద్రబాబు దిగజారుతారన్నారు. అర్హుల ఓట్లను పరిరక్షించుకోవడం ద్వారా వైఎస్సార్‌సీపీ కార్యకర్త, నాయకులు, పార్టీ భవిష్యత్తు నిర్ణయిస్తాయన్నారు. కూటమి నేతలు, వారికి కొమ్ముకాసే కొందరు ప్రభుత్వ సిబ్బంది పట్ల బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి వద్ద ఓటరు అందుబాటులో లేకపోతే ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన 13 రకాల ధ్రువపత్రాలలో ఏదొకటి చూపించి ఓటు హక్కును పరిరక్షించుకోవచ్చన్నారు. ఫారం– 6 ద్వారా అర్హత గల వారికి కొత్తగా ఓటు హక్కును కల్పించాలని, ఫారం– 8 ద్వారా ఓటు హక్కును సవరించుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement