జలకళ ఏదీ! | - | Sakshi
Sakshi News home page

జలకళ ఏదీ!

Jul 6 2026 2:10 AM | Updated on Jul 6 2026 2:10 AM

● పోతిరెడ్డిపాడు వద్ద కానరాని నీటి జాడ ● గతేడాది జులై 6న గేట్లు ఎత్తి నీటివిడుదల

● పోతిరెడ్డిపాడు వద్ద కానరాని నీటి జాడ ● గతేడాది జులై 6న గేట్లు ఎత్తి నీటివిడుదల

నీటిప్రవాహం లేని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌

జూపాడుబంగ్లా: ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో కరువు ఛాయలు అలుముకున్నాయి. అరకొరగా కురిసిన వర్షాలకు సాగు చేసిన ఖరీఫ్‌ పంటలు వాడుముఖం పట్టాయి. కాలువల నీటితో పంటలను కాపాడుకుందామంటే జలాశయాల్లో నీళ్లు లేవు. గతేడాది జూన్‌ 15 తేదీ నుంచే శ్రీశైలం జలాశయంలోకి వరదనీటి ప్రవాహం ప్రారంభం కాగా 21 తేదీ నాటికి జలాశయంలో 852 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. జూలై 6వ తేదీ నాటికి 878.40అడుగుల నీటిమట్టం చేరుకోగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయంలో 822 అడుగుల నీటిమట్టం ఉండగా డ్యాంలోకి వరద నీటిప్రవాహం జీరో. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ అప్రోచ్‌ కాల్వల్లో కనుచూపుమేరలో కూడా నీటిప్రవాహ జాడ కనిపించటం లేదు. ఎల్‌నినో ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవటంతో శ్రీశైలం డ్యాంలోకి వరదనీటి నీటిప్రవాహం లేదని అధికారులు పేర్కొంటున్నారు. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి నీరు విడుదలైతేనే వెలుగోడు, గోరుకల్లు, అవుకు, గండికోట, మైలవరం, ఎల్లనూరు, పైడిపాలెం తదితర రిజర్వాయర్లలో జలకళ ఉంటుంది. ప్రస్తుతం ఆయా రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement