బడిబాట పట్టనున్న 2.71 లక్షల మంది విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలల్లో స్వాగతం పలకనున్న అవే సమస్యలు
జిల్లాకు పూర్తి స్థాయిలో చేరని విద్యా మిత్ర కిట్లు
మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించని కూటమి ప్రభుత్వం
అసంపూర్తిగా అదనపు గదుల నిర్మాణం
మరమ్మతులకు నోచుకోని వాటర్ ప్లాంట్లు
పరిష్కారం కాని మరుగుదొడ్ల సమస్య
నిర్మాణాలు పూర్తి చేయాలి
పాఠశాలలను అభివృద్ధి చేయాలి
సౌకర్యాలపై దృష్టి సారిస్తాం
కిట్టులోని వస్తువులు ఇండెంటు చేరినవి
నోట్‌బుక్స్ 8,39,965 8,19,061
బ్యాగులు 1,39,679 0
బెల్టులు 93,644 0
బూట్లు 1,39,679 0
యూనిఫాం 1,39,679 1,39,679
డిక్షనరీలు 14,527 0
వర్క్‌బుక్స్ 89,442 82,975
టెక్ట్స్‌బుక్స్ 6,38,577 6,18,334
ఉయ్యాలవాడ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లకు సిమెంట్ రేకులను అడ్డుగా పెట్టిన దృశ్యం
నంద్యాల(న్యూటౌన్): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. రెండేళ్లుగా దృష్టి సారించకపోవడంతో సమస్యలు వేధిస్తున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన విద్యార్థుల సంక్షేమ పథకాల పేర్లు మార్చడం తప్ప బడుల్లో ప్రగతి జాడలు కనిపించడం లేదు. 2026 – 27 విద్యా సంవత్సరం నేటి నుంచి ప్రారంభమవుతోంది. గతంలో మొదటి రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు కిట్లు ఇచ్చేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర కిట్లుగా పేరు మార్చారు కానీ... పాఠశాలల పునఃప్రారంభం రోజున ఇవ్వకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటి వరకు స్కూల్ పాయింటుకు పూర్తి స్థాయిలో బుక్స్ చేరలేదు. బ్యాగ్‌లు, బూట్లు, బెల్ట్‌లు ఒక్కటీ కూడా జిల్లా కేంద్రానికే రాలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అసౌకర్యాల మధ్య ఆయా ప్రధానోపాధ్యాయులు పాఠశాలలు పునః ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 1,956 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2.71 లక్షలు మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 997, ప్రాథమికోన్నత 21, ఉన్నత పాఠశాలలు 327, ఎయిడెడ్ 46 పాఠశాలలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థలన్నీ శుక్రవారం నుంచి పునఃప్రారంభమై అరకొర వసతుల మధ్య చదువులు కొనసాగనున్నాయి.
బ్యాగులు.. బూట్లు రాలేదు..
గతంలో పాఠశాలలు పునః ప్రారంభం రోజు పుస్తకాలు, కిట్స్ రెడీగా ఉండేవి. కూటమి సర్కారుకు ముందు చూపు లేకపోవడంతో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు విద్యా మిత్ర కిట్స్ అందుబాటులో లేవు. జిల్లాలోని 1,391 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 1.30 లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బెల్టులు, డిక్షనరీలు, బ్యాగులు, స్కూల్ యూనిఫాం, వర్క్ బుక్స్ ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో సగానికి పైగా కిట్లు స్కూల్ పాయింట్‌కు చేరలేదు. బూట్లు 1,39,679 అవసరం ఉండగా ఒక్కటి కూడా రాలేదు. డిక్షనరీలు 14,527 అవసరం ఉండగా ఒక్కటీ కూడా ఇవ్వలేదు. యూనిఫాం 1,39,679 మందికి ఒ క్కొక్కరికి మూడు జతల చొప్పున రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఒక జత మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. బ్యాగులు, బూట్లు అసలే రాలేదు. ఎప్పుడు ఇస్తారో విద్యాశాఖ అధికారులకే స్పష్టత లేదు.
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
గత ప్రభుత్వంలో నాడు – నేడు కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. అసౌకర్యాల మధ్యనే విద్యార్థులు చదువుకోవాల్సిన దుస్ధితి ఉంది. అర్ధాంతరంగా ఆగిన పను లు కూటమి ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలి.
– సురేష్‌యాదవ్, వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు
కూటమి ప్రభుత్వం ప్రభుత్వ బడులను పట్టించుకోవడం లేదు. నిధులు మంజూరు చేస్తే పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. గత ప్రభుత్వంలో అదనపు తరగతి గదుల నిర్మాణాలు పది నుంచి 20 శాతం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు మంజూరు చేసి అన్ని పాఠశాలలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
– ఎర్రిస్వామి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఈనెల 12 నుంచి యథావిధిగా అన్ని పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. మెరుగైన విద్యా బోధన, వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో పుష్కలంగా ఉన్నాయి. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో వారి పిల్లల్ని చేర్పించాలి. కార్పొరేట్ పాఠశాలల్లో మూస పద్ధతిలో బట్టీ చదువులు ఉంటాయనేది గ్రహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలపై దృష్టి సారిస్తాం.
– జనార్దన్‌రెడ్డి, డీఈఓ, నంద్యాల


