డోన్‌లో రైల్వే గేట్ల సమస్య పరిష్కారానికి బుగ్గన కృషి
గత ప్రభుత్వంలో రూ. 12 కోట్లు మంజూరు
రైల్వే గేట్ల వద్ద ఆర్‌యూబీలనిర్మాణానికి శంకుస్థాపన
కూటమి ప్రభుత్వంలో ఎక్కడి పనులు అక్కడే
ప్రభుత్వ తీరును నిరససిస్తూ నేడు ‘చలో రైల్వే గేట్లు’
చిత్తశుద్ధి ఏదీ ?
డోన్: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో మంజూరైన పలు అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. నిధులు లేవంటూ రెండేళ్లుగా ఎక్కడి పనులను అక్కడే నిలిపేసింది. నంద్యాల, కర్నూలు రైల్వే గేట్ల సమస్య కూడా ఇదే కోవకు వస్తాయి. పట్టణ నడి బొడ్డున ఉన్న గుంతకల్లు – నంద్యాల వైపు వెళ్లే రైల్వే గేటు, కర్నూలు – గుంతకల్లు వైపు వెళ్లే రెండు ప్రధాన రైల్వే గేట్ల కింద రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణం కోసం అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కృషి చేశారు. సమస్యను అప్పటి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే శాఖ సహాయ మంత్రి పీయూస్ గోయల్, రైల్వే శాఖ జనరల్ మెనేజర్ గజనంద మాలవ్య, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మెనేజర్ అనూప్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు, మరో వైపు గుంతకల్ డీఆర్‌ఎంలతో కలిసి ఆర్‌యూబీ పనులు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ల ఆధ్వర్యంలో 32 కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులతో కలిసి ప్రతేక్య బృందాలుగా ఏర్పడి కలిసి విన్నవించడంతో ఆర్‌యూబీలు మంజూరయ్యాయి. గత ప్రభుత్వంలో రూ.12 కోట్లు కేటాయించారు. ఈ మేరకు 2023 జూలై 3వ తేదీ పనులకు బుగ్గన శంకుప్థాన చేశారు. ఈ పనులతో స్థల సేకరణలో నష్టపోయిన బాధితుల కోసం రూ.3 కోట్లను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థలసేకరణ అటకెక్కింది. ఈ సందర్భంలో అండర్ పాస్ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం మోకాలొడ్డడంతో ఆర్‌యూబీ పనులు అంగుళం కూడా కదలలేదు. అండర్ పాస్ నిర్మాణం పనుల కోసం అప్పటి కాంట్రాక్టర్ సిద్ధం చేసిన పదుల సంఖ్యలో సిమెంట్ రింగ్ బండ్ల్ నేటికీ నిరుపయోగంగా ఉన్నాయి.
నేడు చలో నంద్యాల, కర్నూలు రైల్వే గేట్లు..
‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆయన స్వగృహం నుంచి పోలీస్ స్టేషన్, కోర్టు, పాత బస్టాండ్ మీదుగా వేలాది మంది కార్యకర్తలతో కలిసి చలో రైల్వే గేట్లు కార్యక్రమాన్ని చేపట్టారు. అత్యంత ప్రాధాన్యత ఉన్న రైల్వే గేట్ల వద్ద ఆర్‌యూబీ లాంటి సమస్యను పరిష్కరించకుండా మొద్దు నిద్ర పోతున్న కూటమి ప్రభుత్వాన్ని మేల్కొపడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రజా ప్రతినిధులకు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. మూడు ప్రధాన రైల్వే గేట్లతో పట్టణం మూడు భాగాలుగా విడిపోయింది. భవిష్యత్త్‌లో రైలు, గూడ్సుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో మూడు గేట్లను శాశ్వతంగా మూసివేస్తారు. వీటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాల వారి కోసం ఆర్‌యూబీ మంజూరు చేస్తే కూటమి ప్రభుత్వం అటకెక్కించడం దుర్మార్గం. రైల్వే గేట్ల సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
– బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రి


