నంద్యాల: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా నాయకులకు పదవులు దక్కాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పాణ్యం నియోజకవర్గానికి చెందిన షేక్ యూనిస్ బాషాను రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా, నంద్యాల నియోజకవర్గానికి చెందిన మానిపాటి ఆంజనేయులును రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా, పాణ్యం నియోజకవర్గానికి చెందిన హనుమంతురెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన ఓంకారేశ్వరరెడ్డిని పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీలుగా నియమిస్తూ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
విచారణకు గైర్హాజరు
నందికొట్కూరు: రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే) అద్దె భవనాల యజమానులు గురువా రం విచారణకు డుమ్మా కొట్టారు. జూపాడు బంగ్లా మండలంలోని 12 రైతు భరోసా కేంద్రాలను అద్దె భవనంలో నిర్వహించారు. అద్దెకు సంబంధించిన భవనాలకు నెల బాడుగ చెల్లింపులో రూ.లక్షలు కాజేశారని అప్పటి ఏఈ రంగారెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు విచారణ చేపట్టి అద్దె భవనాల యజమానులకు నోటీసులు ఇచ్చారు. వారిలో ఒక్కరు మాత్రమే హాజరై, మిగతా వారు రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ జిల్లా సహాయ సంచాలకురాలు సరళ, ఏవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, స్థానిక ఏడీఏ గిరీష్ సాయంత్రం వరకు వేచి ఉండి వెళ్లిపోయారు.
పొలం దున్నుతూ..
జూపాడుబంగ్లా: రోటావేటర్‌తో పొలం దున్నుతూ ప్రమాదవశాత్తు దాని కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం మండల కేంద్రమైన జూపాడుబంగ్లాలో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 80 బన్నూరు గ్రామానికి చెందిన అశోక్‌రెడ్డి పొలాన్ని పగిడ్యాల మండలం నెహ్రూనగర్‌కు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి కౌలుకు తీసుకున్నాడు. అతని ట్రాక్టర్‌కు తరిగోపుల గ్రామానికి చెందిన సత్యరాజ్ (43) డ్రైవర్‌గా వెళ్లాడు. సాయంత్రం పొలాన్ని దున్నుతుండగా ట్రాక్టర్‌కు ఉన్న రోటావేటర్ మొరాయిస్తుండటంతో పరిశీలించేందుకు కిందికి దిగాడు. రోటావేటర్‌ను పరిశీలిస్తుండగా ట్రాక్టర్ ముందుకు కదలడంతో దాని కిందపడి సత్యరాజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతన్ని హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. మృతునికి భార్య జయమ్మ, ఇద్దరు కుమారులున్నా రు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు.
కోవెలకుంట్ల: అవుకు మండలం కాశీపురానికి చెందిన ఓ రైతు కష్టానికి ప్రతిఫలం దక్కింది. వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ సత్యసాయి జిల్లాకు చెందిన తపన సాహిత్య వేదిక రైతులకు పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన గంగిరెడ్డి సుధాకర్‌రెడ్డిని ‘మట్టి మనిషి’ పురస్కారానికి ఎంపిక చేసింది. వ్యవసాయంపై ఆసక్తి ఉన్న సుధాకర్‌రెడ్డి గత కొన్నేళ్ల నుంచి మిరప, మొక్కజొన్న, శనగ పంటలతో పాటు మామిడి, సపోట, చినీ, నేరేడు, తదితర పండ్ల తోటలను సాగు చేస్తున్నాడు. కూలీలతో పనులు చేయిస్తూ పొలం గట్టున కూర్చోకుండా తాను కూలీలతో కలిసి వ్యవసాయ పనులు చేస్తుంటారు. వ్యవసాయ రంగంలో సేద్యం మొదలుకొని పంట చేతికొచ్చే వరకు చేసే పనుల్లో ప్రావీణ్యం సాధించి ఆ పనులన్నీ స్వయంగా చేస్తూ ఆయా పంటల్లో దిగుబడులు సాధిస్తున్నారు. తపన సాహిత్య వేదిక రచయితలు, కవులు, తదితర రంగాల్లో ప్రతిభ చాటిన వారికి ప్రతి ఏటా పురస్కారాలు ప్రదానం చేస్తోంది. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఏడాది నుంచి ఆ రంగంలో అవార్డులు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కూలీలతోపాటు యజమాని వ్యవసాయ పనులు చేస్తున్న సుధాకర్‌రెడ్డిని గుర్తించి మట్టిమనిషి పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ నెల 21వ తేదీన సత్యసాయి జిల్లా హిందూపురంలోని తపన సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సేవా పురస్కారం అందించనున్నారు.
బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
ఆదోని అర్బన్: ఆదోని పట్టణంలో బాల్యవివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పట్టణంలోని 35వ వార్డు అమరావతినగర్ కాలనీలో నివాసముంటున్న శారద కుమార్తెకు ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌తో వివాహం చేసుకోవడానికి నిశ్చయించారు. నిశ్చయ తాంబూలం తీసుకోవడానికి గురువారం అమరావతి నగర్‌కు రావడంతో విషయం తెలిసి పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. బాల్యవివాహంతో జరిగే అనర్థాలపై కుటుంబ సభ్యులకు వివరించారు.


