
సార్.. మా పింఛన్లు పునరుద్ధరించండి
కొలిమిగుండ్ల: ప్రభుత్వం తొలగించిన పింఛన్‌లను వెంటనే పునరుద్ధరించాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు. గురువారం వివిధ గ్రామాలకు చెందిన దివ్యాంగులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని డిప్యూటీ ఎంపీడీఓ చంద్రమౌళీశ్వరగౌడ్‌కు వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్నామని, కూటమి ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగా తమ పేర్లను తొలగించిందని మండిపడ్డారు. పర్మినెంట్ సదరం సర్టిఫికెట్లు ఉన్నా రీవెరిఫికేషన్‌కు అంటూ వైకల్య శాతం తక్కువ చూపడం పేదలను మోసం చేయడమే నన్నారు. యథావిధిగా వచ్చే నెల 1వ తేదీ పింఛన్ సొమ్ము అందించాలని డిమాండ్ చేశారు.
పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలి
శిరివెళ్ల: విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలని డీఈఓ జనార్దనరెడ్డి అన్నారు. గురువారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీ, వంట గదిని పరిశీలించారు. మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తున్నా కొందరు విద్యార్థులు ఎందుకు తినడం లేదని, వారి జాబితా తయారు చేసి తల్లిదండ్రులతో మాట్లాడాలని హెచ్‌ఎం గోవిందరాజును ఆదేశించారు. స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థులకు యూనిఫాం అందజేశారు. అనంతరం ఎస్సీ కాలనీలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి ప్రతి పాదనలు పంపాలని హెచ్‌ఎం తేజోవతమ్మను ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ డీఈఓ శంకరప్రసాదు, సీఆర్పీ అన్సర్ ఉన్నారు.
ఆత్మకూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆత్మకూరు ఏడీఏ హేమలత అన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నిపుణులు అశోక్‌కుమార్, ప్రధాన శాస్త్రవేత్త పుల్లీబాయ్, సీనియర్ శాస్త్రవేత్త నజీరుద్దీన్‌తో కలసి గురువారం ఆమె నీట మునిగిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాలకు మొక్కజొన్న, పత్తి, మెట్ట వరి పంటలు దెబ్బతిన్నాయన్నారు. పంటలలో నిలిచిన నీటిని తొలగించిన అనంతరం హెక్టారుకు పది కిలోల యూరియా లేదా పొటాషియం నైట్రేట్ ఐదు కేజీల చొప్పున లేదా 19.19.19 స్పేర్ రూపంలో నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. ఇలా చేయడం వల్ల పంటను తేమ, తెగుళ్ల నుంచి కాపాడుకోవచ్చన్నారు.

సార్.. మా పింఛన్లు పునరుద్ధరించండి

సార్.. మా పింఛన్లు పునరుద్ధరించండి