
యూరియా అక్రమ రవాణా చేస్తే చర్యలు
● రెతులకు ఇచ్చే రాయితీ యూరియా పరిశ్రమలకు వాడరాదు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల: జిల్లాకు మంజూరైన రాయి తీ యూరియా ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో యూరియా అక్రమ రవాణాపై వ్యవసాయ శాఖ, పోలీస్, సివిల్ సప్లై, ఇండస్ట్రీస్, విజిలెనన్స్, పశుసంవర్ధక శాఖ, పొల్యూషన్ బోర్డ్ అధికారులతో కలెక్టర్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంటల సాగు విస్తీర్ణం మేరకు రాయితీ యూరియా జిల్లాకే మంజూరవుతుందన్నారు. జిల్లాలో రైతులకిచ్చే రాయితీ యూరియాను కొందరు దారి మళ్లించి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని యూరియా అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. పట్టణంలో రాయితీ యూరియాను వివిధ రకాల పరిశ్రమలైన పౌల్ట్రీ ఫీడ్, క్యాటిల్ ఫీడ్, ఆల్కహాల్, ఫ్లై వుడ్ ఇండస్ట్రీస్, ప్లేట్, వస్త్ర పరిశ్రమ, సోప్స్ తయారీ వంటి అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. రైతులకు ఇచ్చే రాయితీ యూరియా పంట పొలాలకు మాత్రమే వాడాలని, ఇతర అవసరాలకు ఉపయోగించడం నేరమన్నారు. యూరియా అక్రమ రవాణా నివారణకు సంబంధించి మండల స్థాయిలో ఒక టీం వేసి తనిఖీ చేసి రెండు రోజుల్లో నివేదిక అందజేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని, ఎక్కడ కూడా యూరియా కొరత తలెత్తకూడదని అధికారులను ఆదేశించారు.