
27 నుంచి గణేశ్ ఉత్సవాలు
● వచ్చే నెల 4న కర్నూలులో నిమజ్జనోత్సవం
కర్నూలు కల్చరల్: గణేశ్ ఉత్సవాలు ఈనెల 27 నుంచి ప్రారంభభమవుతాయని గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ తెలిపారు. కర్నూలులోని వినాయక ఘాట్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం సమావేశ మందిరంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ, గూడూరు, ఇతర పట్టణాల్లో 27 నుంచి 31వ తేదీ వరకు వినాయక చవితి ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయన్నారు. కర్నూలు నగరంలో సెప్టెంబర్ 4వ తేదీ నిమజ్జనోత్సవం ఉంటుందన్నారు. గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా కార్యదర్శి గోరంట్ల రమణ మాట్లాడుతూ.. మట్టివినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. నగర అధ్యక్షుడు రంగస్వామి మాట్లాడుతూ.. విగ్రహాల ఎత్తులో కాకుండా సంప్రదాయ పద్ధతిలో ఉత్సవాల నిర్వహణకు పోటీ పడాలన్నారు. మండపాల నిర్వాహకులతో ఆదివారం సమావేశం నిర్వహిస్తామన్నారు. క్రెడో స్కూల్‌లో విద్యార్థులకు 24న వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి నగర కార్యదర్శి గురిరాజవర్మ, సభ్యులు కొట్టే చెన్నయ్య, భాను ప్రకాష్, అక్కెం విశ్వనాథ్ పాల్గొన్నారు.
మంత్రాలయం రూరల్: రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో శ్రీమఠం కారిడార్‌లో సందడి నెలకొంది. శనివారం ప్రత్యేక పర్వదినం, గోకులాష్టామి సెలవు దినం కావడంతో భక్తుల కోలాహలం కొనసాగింది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాధిగా భక్తులు తరలివచ్చి రాఘవేంద్రులు మూలబృందవాన్ని దర్శించుకున్నారు.
కర్నూలు: గ్రామీణ ప్రాంతాల నుంచి కర్నూలుకు వచ్చే సెవెన్ సీటర్ ఆటోలను నగరంలోకి అనుమతించేది లేదని ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లు తమ ఆటోలను కర్నూలు నగర శివారులోనే నిలుపుకోవాలని సూచించారు. నంద్యాల చెక్‌పోస్టు, గుత్తి పెట్రోల్ బంకు, బళ్లారి చౌరస్తా, సెయింట్‌జోసెఫ్ కాలేజీ వరకు మాత్రమే ఆటోలకు అనుమతి ఉంటుందని, పోలీసు ఆదేశాలను ఖాతరు చేయకుండా నగరంలోకి ప్రవేశిస్తే కేసులతో పాటు భారీగా చలానాలు విధిస్తామని హెచ్చరించారు. కర్నూలు నగరంలోని పాతబస్తీలో రాధాకృష్ణ టాకీస్ నుంచి నెహ్రూ రోడ్డు మీదుగా (బొంగుల బజార్), మించిన్ బజార్ రూట్లలో ఒకవైపు ప్రయాణం మాత్రమే (వన్‌వే) అనుమతిస్తామన్నారు.

27 నుంచి గణేశ్ ఉత్సవాలు