
గుట్టుగా కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం
జూపాడుబంగ్లా: తంగడంచ గ్రామరెవెన్యూ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా ఓ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. తంగడంచ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 358, 359, 368లో ఆద్యా అగ్రిక్రాప్ సైన్సెస్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ విషయం ఇప్పటిదాకా తంగడంచ గ్రామస్తులకెవ్వరికీ తెలియక పోవడం గమనార్హం. ఫ్యాక్టరీ నిర్మాణానికి గ్రామపంచాయతీ తీర్మానంతో పాటు గ్రామస్తుల అభిప్రాయసేకరణ, మండల రెవెన్యూ, అభివృద్ధి అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామస్తుల అభిప్రాయసేకరణ తీసుకోకుండానే కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం పనులు చూసేందుకు కూడా అక్కడున్న వారు లోపలికి వెళ్లనివ్వటం లేదంటే ఎంత పకడ్బందీగా ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మండల, జిల్లా స్థాయి అధికారులు తంగడంచ వద్ద జరుగుతున్న ఫ్యాక్టరీలో భవిష్యత్లో ఎలాంటి ఉత్పత్తుల్తు చేస్తారో, స్థానిక నిరుద్యోగులకు ఎంత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారో అనే విషయాలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై తహసీల్దార్ చంద్రశేఖర్నాయక్ను వివ రణ కోరగా తంగడంచ భూములు ఏపీఐఐసీ వారికి అప్పగించినందున ఫ్యాక్టరీలకు రెవెన్యూ అధికారుల అనుమతి అవసరం ఉండదని, ఏపీఐఐసీ అధికారులే కంపెనీల నిర్మాణం ప్రక్రియకు సంబంధించిన అన్ని అనుమతులు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు.