
నేత్రదానంపై అపోహలు తొలగిపోవాలి
కర్నూలు(హాస్పిటల్): నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.శాంతికళ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పెద్దమార్కెట్ ప్రాంతంలో జయలక్ష్మి(77) అనే మహిళ గుండెపోటుతో మరణించారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వారు అక్కడికి వెళ్లి నేత్రదానానికి ఆమె కుటుంబసభ్యులను ఒప్పించారు. వారి సమాచారంతో స్థానిక బుధవారపేటలోని సుశీల నేత్రాలయ సిబ్బంది వెళ్లి ఆమె నేత్రాలను సేకరించారు. శనివారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.శాంతికళ మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందుకు ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ సహకారం కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు. సుశీల నేత్రాలయ కంటి వైద్యులు డాక్టర్ పి.సుధాకర్‌రావు మాట్లాడుతూ ఒకరి నేత్రదానం వల్ల ఇద్దరికి చూపు వస్తుందని, అందుకే తమ ఆసుపత్రిలో నేత్ర సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రెండేళ్ల కాలంలో 110కి పైగా కార్నియా ఆపరేషన్లు నిర్వహించి చూపు ప్రసాదించినట్లు తెలిపారు. నేత్రదానం చేయదలచిన వారు 8886306308ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో గైనకాలజిస్టు డాక్టర్ సావిత్రి, కంటి వైద్యులు డాక్టర్ నేహ సుధాకర్, డాక్టర్ రాఘవప్రీతమ్ పాల్గొన్నారు.