
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: వరుస సెలవుల నేపథ్యంలో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
శాస్త్రోక్తంగా గోపూజ
శ్రీశైలంటెంపుల్: కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానంలోని శ్రీగోకులంలో శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు, పండితులు పూజా సంకల్పాన్ని పఠించారు. అనంతరం శ్రీసూక్తంతోనూ, గో అష్టోత్తర మంత్రంతోనూ, గోవులకు షోడశ ఉపచారాలతో పూజాదికాలు జరిపించారు. గోవులకు నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. దేవస్థాన గోసంరక్షణశాలలో కూడా శ్రీకృష్ణుని పూజ, గోపూజ జరిపించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు.
యూరియా పక్కదారి!
మహానంది: రైతు సేవాకేంద్రానికి వచ్చిన యూరియా పక్కదారి పడుతోంది. టీడీపీ నేతల సహకారంతో ప్రైవేటు గోడౌన్లకు తరలుతోంది. మసీదుపురం గ్రామ సమీపంలోని ఓ ప్రైవేటు గోడౌన్‌కు రెండు లారీల యూరియా వెళ్లడం చర్చనీయాంశమైంది. రైతులకు యూరియా అందించకుండా పక్కదారి మళ్లిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మసీదుపురం గ్రామ సర్పంచ్ లక్ష్మిరెడ్డి, ఎంపీటీసీ మల్లికార్జునరెడ్డి కోరారు. ఈ విషయంపై ఏఓ నాగేశ్వరరెడ్డిని వివరణ కోరగా.. గ్రామ సమీపంలో వంతెన మరమ్మతులు జరుగుతుండటంతో యూరియా నిల్వలు అక్కడే ఉంచి రైతులకు పంపిణీ చేసినట్లు చెప్పారు.
పోతిరెడ్డిపాడు నుంచి
నీటి విడుదల పెంపు
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 26వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచినట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్లను 0.05 అడుగు మేర ఎత్తి నీటినిఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నామన్నారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 12వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ(జీఎన్‌ఎస్‌ఎస్)కాల్వకు 10వేలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 8వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
విద్యుదాఘాతంతో
చిరుతపులికి గాయాలు
శ్రీశైలంప్రాజెక్ట్: విద్యుదాఘాతంతో శనివారం రాత్రి లింగాలగట్టు గ్రామం వద్ద చిరుతపులికి గాయాలు అయ్యాయి. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం దిగువన, లింగాలగట్టు గ్రామం పొలిమేరలో ఈ ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత పులి కొండ చరియలను దాటుకొనే ప్రయత్నంలో జారి పడింది. ఆ ప్రాంతంలో లింగాలగట్టు వాసుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి విద్యుదాఘాతంతో గాయాలు అయ్యాయి. గాయాలతోనే అక్కడే ఉన్న పొదల్లోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలంలో భక్తుల రద్దీ