
కోవెలకుంట్ల సమీపంలో సాగైన మొక్కజొన్న
గతేడాది వెంటాడిన తుపాన్లు
ఈ ఏడాది జిల్లాలో 54,150 హెక్టార్లలో సాగు లక్ష్యం
ఇప్పటికే 101 శాతం పైగా సాగు
మిరపకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న
సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం
కోవెలకుంట్ల: గతేడాది నష్టాలు మూటగట్టుకున్న మొక్కజొన్న రైతులు దేవుడిపై భారం వేసి ఈ ఏడాది మళ్లీ అదే పంట సాగు చేస్తున్నారు. విత్తనానికి ముందు విస్తారంగా వర్షాలు కురియడంతో సాగుకు అనుకూలంగా మారింది. బోర్లు, బావులు, చెరువులు, తదితర సాగు నీరు వనరులు అందుబాటులో ఉండటంతో లక్ష్యానికి మించి సాగు కావడం గమనార్హం. ఇటీవల ఎస్సార్బీసీ, కేసీకెనాల్, తెలుగుగంగ కాల్వల్లో నీరు పుష్కలంగా చేరడంతో సాగు విస్తీర్ణం మరింత పెరిగే ఆస్కారం ఉన్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 54,150 హెక్టార్లలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు ఆయా మండలాల పరిధిలో 55,408 హెక్టార్లలో సాగైంది. ఇందులో జిల్లాలోని పాములపాడు మండలంలో అత్యధికంగా 6,745 హెక్టార్లలో, కొత్తపల్లె 5,793, పాణ్యం 5,279, నందికొట్కూరు 4,607, ఆళ్లగడ్డ 4,288, ఆత్మకూరు 4,033, బనగానపల్లె 3,964, మిడుతూరు 3,635 హెక్టార్లలో రుద్రవరం 3,225, పగిడ్యాల మండలంలో 2,406 హెక్టార్లలో మొక్కజొన్న సాగైంది. గత ఏడాది జిల్లాలోని 45,200 హెక్టార్లలో మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం కాగా ఆయా డలాల్లో 54 వేల హెక్టార్లలో సాగు చేశారు. 105 నుంచి 110 రోజులు పంటకాలం కాగా పైరు ఆరంభంలో వర్షాభా పంట చేతికందే తరుణంలో తుపాన్ వెంటాడి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎకరాకు 22 నుంచి 30 క్వింటాళ్లలోపే దిగుబడులు రావడంతో నష్టాల ఊబిలోకూరకపోయారు. మార్కెట్‌లో క్వింటా రూ. 2,200 మించి పలకపోవడంతో నష్టాలు మూటగట్టుకున్నారు.
కత్తెర పురుగు భయం
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొక్కజొన్న రెండు నెలల దశలో ఉండగా కొన్ని ప్రాంతాల్లో నెల రోజుల దశలో ఉంది. ముందుగా సాగు చేసిన మొక్కజొన్నను కత్తెర పురుగు వెంటాడే ఆస్కారం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పైరును కత్తెర పురుగు ఆశిస్తే దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపనుంది. సుంకుదశలో ఉన్న మొక్కజొన్న పైరు ను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. మొక్కజొన్న కంకి కట్టే దశలో భారీ వర్షాలు కురిస్తే నష్టం చేకూరుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో కోటి ఆశలతో మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయా, ప్రకృతి వైపరీత్యాలు మరోసారి దెబ్బతీస్తాయన్న ఆందోళన నెలకొంది.
మిరపకు ప్రత్యామ్నాయంగా..
రెండేళ్ల నుంచి మిర్చి సాగు రైతుల కళ్లలో కారం కొడుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు మిర్చి ఎర్ర బంగారం కాగా గత ఏడాది నుంచి భారంగా మారింది. 2021–22, 2022–23 సంవత్సరాల్లో క్వింటా ఎండు మిరపకాయలు రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు ధర పలికాయి. గతేడాది నుంచి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గతేడాది నవంబర్ నెలలో క్వింటా రూ. 15 వేల నుంచి రూ. 16 వేలు పలుకగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ధర రూ. 10 వేలకు పడిపోయింది. మిరప సాగుకు ఎకరాకు రూ. లక్ష నుంచి రూ. 1.25 లక్షల వరకు ఖర్చు వస్తుంది. మిర్చికి తెగుళ్లు ఆశించడం, దిగుబడులు గణనీయంగా తగ్గడమేకాకుండా గిట్టుబాటు ధర లేకపోవడంతో గతేడాది ఎకరాకు రూ. 50 వేల నష్టం వాటిల్లింది. దీంతో ఈ ఏడాది మిరప సాగు చేయాలంటే నే రైతు లు భయపడుతున్నారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 5–6 వేల హెక్టార్లకు మించి మిరప సాగయ్యే సూచనలు లేవని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది మిరపసాగు తో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈ ఏడాది అంతమొత్తం పెట్టుబడి పెట్టి సాగు చేసేందుకు సాహ సం చేయడం లేదు. మిరపకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న విస్తారంగా సాగైంది. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, మూడు నుంచి నాలుగు సాగునీటి తడులు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు పెట్టుబడులు వెచ్చించాల్సి ఉంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొక్కజొన్న రెండు నెలల దశలో ఉండగా కొన్ని ప్రాంతాల్లో నెల రోజుల దశలో ఉంది. జిల్లాలో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.
ఐదు ఎకరాల్లో సాగు చేశా
ఈ ఏడాది ఐదు ఎకరాల సొంత పొలంలో నెల రోజుల క్రితం మొక్కజొన్న పంట సాగు చేశాను. పెట్టుబడుల రూపంలో ఇప్పటి వరకు ఎకరాకు రూ. 12 వేలు వచ్చింది. గత ఏడాది రెండు ఎకరాలు సాగు చేయగా ఏడాది అదనంగా మరో మూడు ఎకరాల్లో వేశాను. నాలుగు నెలల పంటకాల కాగా ఇప్పటి వరకు పైరు ఆశాజనకంగా ఉంది. – రాంభూపాల్‌రెడ్డి, రైతు, కోవెలకుంట్ల
ఈ ఏడాది దిగుబడులపై ఆశలు
గత ఏడాది మొక్కజొన్న సాగు చేసి నష్టాలు చవి చూశాను. ఈ ఏ డాది ఎకరా రూ. 15 వేలు మేరకు మూడు ఎకరాలు కౌలుకు తీసుకు ని రెండు నెలల క్రితం మొక్కజొన్న పంట సాగు చేశాను. పెట్టు బడుల రూపంలో ఇప్పటి వరకు ఎకరాకు రూ. 10 వేలకు పైగా పెట్టాను. వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సాగు కలిసొస్తుందని భావిస్తున్నాను. – కృష్ణారెడ్డి, రైతు, భీమునిపాడు, కోవెలకుంట్ల మండలం