
కూటమి సర్కార్ ‘రాజకీయ కూల్చివేతలు’
● వైఎస్సార్‌సీపీ నాయకుడు భూమా కిషోర్‌రెడ్డి కాంపౌండ్ వాల్ కూల్చివేత
ఆళ్లగడ్డ: నంద్యాల నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా అధికారులను అడ్డుపెట్టుకుని రాజకీయ కూల్చివేతలకు తెర తీశారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రాం కక్ష సాధింపునకు అధికారులు బేషరతుగా జీ హుజూర్ అంటున్నారు. వైఎస్సార్‌సీపీ నేతల నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా భార్గవ్ డైరెక్షన్‌లో అధికారులు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్‌రెడ్డి తన స్థలానికి ఎప్పుడో నిర్మించుకున్న ప్రహరీ కూల్చివేతకు అధికారులు యత్నించడం మంగళవారం పట్టణంలో ఉద్రిక్తతకు దారి తీసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్‌రెడ్డికి సర్వే నెం.574/2 లో 3.50 ఎకరాల పొలం ఉంది. ఈ స్థలం కబ్జాకు గురికాకుండా సుమారు 4 సంవత్సరాల క్రితం చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు. అఖిలప్రియ ఎమ్మెల్యే అయిన మొదటి రోజు నుంచే ఆమె భర్త భార్గవరాం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈ ప్రహరీ కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అధికార పార్టీ నేత ఒత్తిడికి తలొగ్గిన కమిషనర్ గోడ కూల్చేందుకు జేసీబీ తీసుకునిపోయి కూల్చివేత మొదలు పెట్టారు. అంతలో భూమా కిషోర్‌రెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకుని కమిషనర్ కిషోర్‌తో వాగ్వాదానికి దిగి కూల్చివేతను అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
నిర్మాణానికి అనుమతులు లేవంట..
గోడ కూల్చేందుకు వచ్చిన కమిషనర్‌ను ఎందుకు కూల్చుతున్నారని అడగ్గా ముందుగా గోడ నిర్మాణానికి అనుమతులు లేవని, అనంతరం గోడ అంత ఎత్తు కట్టుకోకూడదని.. మరోసారి పక్కన అనుమతులు లేకుండా ప్లాట్‌లు వేశారని ఇలా పొంతన లేని మాటలు చెప్పడం అక్కడున్న వారికి వింతగా అనిపించింది. అనుమతులు లేకుండా ప్రహరీ నిర్మించారంటే ఇదే సర్వే నంబర్‌లో పదుల సంఖ్యలో ప్రహరీలు నిర్మించారు. ఎత్తుగా ఉందంటే దీని పక్కనే ఎమ్మెల్యే నిర్మాణం సుమారు 10 అడుగుల ఎత్తు ఉంది, మరి వీటన్నింటిజోలికి పోకుండా ఇక్కడకే రావడం ఏంటని ప్రశ్నించారు. కక్ష సాఽధింపు కాకుంటే పక్కనున్న వాటిపై కూడా కమిషనర్ చర్యలు తీసుకోవాలి కదా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంపౌండ్ వాల్
కూల్చివేస్తున్న దృశ్యం
ప్రజలే బుద్ధి చెబుతారు
ఆళ్లగడ్డలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆస్తులను టార్గెట్ చేసి ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ చేస్తున్న దౌర్జన్య కాండకు ప్రజలే బుద్ధి చెబుతారు. ఇదే సర్వే నంబర్‌లో ఉన్న నిర్మాణాలు అధికారులకు కనిపించవా? వాటిపై కూడా చర్యలు తీసుకోవాలి కదా. రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు అధికారపార్టీ నేతలు ఎలా చెబితే అలా తలాడించడం విచారకరం. – భూమా కిషోర్‌రెడ్డి

కూటమి సర్కార్ ‘రాజకీయ కూల్చివేతలు’