
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): వచ్చే నెల 5వ తేదీన గురుపూజ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య, ఎయిడెడ్ పాఠశాలలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల్లో పదేళ్లు పూర్తి చేసిన, అభియోగాలు లేని, క్రిమినల్ కేసులు లేని వారు జిల్లా స్థాయి ఉత్తమ అవార్డుకు అర్హులన్నారు. ఈనెల 19, 20వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి దరఖాస్తులు పంపాలన్నారు.
మద్దిలేటయ్య హుండీ ఆదాయం రూ.69.12 లక్షలు
బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.69.12 లక్షలు వచ్చింది. స్వామి అమ్మవార్లకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలు, ముడుపులను మంగళవారం లెక్కింపు చేపట్టారు. దేవదాయశాఖ అధికారి మోహన్, ఇన్‌స్పెక్టర్ రమేష్ పర్యవేక్షణలో ఆలయ ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో 76 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు నిర్వహించారు. ఇందులో 69,12,094 నగదు, 33 గ్రాముల బంగారు, 2.300 కేజీల వెండి వచ్చింది. కార్యక్రమంలో బాలజీ సేవా ట్రస్ట్ సభ్యులు మహిళా భక్తులు, వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు.
రవ్వలకొండకు దారేది?
బనగానపల్లె: ఎంతో చారిత్రాత్మక విశిష్టత ఉన్న రవ్వలకొండకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉండటంతో పర్యాటకులు, భక్తులు అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని గరిమిరెడ్డి అచ్చమ్మమటం, సమీపంలోని రవ్వలకొండపై ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, కాలజ్ఞానం గుహల సందర్శనకు పర్యాటకులు నిత్యం వస్తుంటారు. అయితే రవ్వలకొండకు వెళ్లే రోడ్డు కంకర తేలి శిథిలావస్థకు చేరడంతో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ రహదారిని బీటి రోడ్డుగా మార్చాలని గతంలో రూ.కోటి నిధులు కూడా మంజూరయ్యా యి. అయితే పనుల్లో జాప్యం కావడంతో నిధులు రద్దయ్యాయి. రహదారి సమస్య మాత్రం పర్యాటకులను వేధిస్తోంది. ప్రతి రోజు రవ్వలకొండను సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి బనగానపల్లెకు చేరుకుంటారు. అక్కడి నుంచి వెళ్లే రహదారిలో కంకర తేలి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రవ్వలకొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది మెరుగైన వసతులు కల్పించాలని గతంలో పంపిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అధికారులు స్పందించి రవ్వలకొండకు బీటీ రోడ్డు నిర్మించాలని యాత్రికులు కోరుతున్నారు.

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం