
మూడోసారి ..
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్టగేట్లను ఈ ఏడాది మూడవసారి తెరిచారు. జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని మంగళవారం 4 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు తెరచి 1,08,628 క్యూసెక్కుల నీటని దిగువకు వదులుతున్నారు. సోమవారం నుంచి మంగళవారం వరకు జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి 2,27,094 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 1,05,606 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 69,988 క్యూసెక్కులు, బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 32,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,818 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డ్యాం పరిసర ప్రాంతాలలో 4.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుడిగట్టు కేంద్రంలో 15.107 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.802 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. మంగళవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 204.3520 టిఎంసీల నీరు లభ్యతగా ఉంది. డ్యాం నీటిమట్టం 883 అడుగులకు చేరుకుంది.