వైద్యసేవలు విస్తృత పరచాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యసేవలు విస్తృత పరచాలి

Aug 15 2025 8:29 AM | Updated on Aug 15 2025 8:29 AM

వైద్యసేవలు విస్తృత పరచాలి

వైద్యసేవలు విస్తృత పరచాలి

డోన్‌: కర్నూలు, నంద్యాల జిల్లాలోని తొమ్మిది మండలాల ప్రజలకు అందుబాటులో ఉన్న డోన్‌ వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలను మరింత విస్తృతపరచాలని వైద్యులను నంద్యాల జిల్లా ఆస్పత్రుల సమన్వయధికారి(డీసీహెచ్‌ఎస్‌) డాక్టర్‌ లలిత ఆదేశించారు. ఆసుపత్రిని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీచేసి ఇక్కడ అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సరైన వైద్యసేవలు అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హనీఫ్‌కు సూచించారు.

జిల్లాలో మోస్తరు వర్షం

నంద్యాల(అర్బన్‌): జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఒక మోస్తరు వర్షం కురిసింది. కొత్తపల్లె మండలంలో అత్యధికంగా 40.6 మి.మీ వర్షం కురియగా చాగలమర్రి మండలంలో అత్యల్పంగా 2.2 మి.మీ వర్షం కురిసింది.

ప్రజాస్వామ్యం ఖూనీ

నంద్యాల: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను ఏ విధంగా పాలిస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఒంటిమిట్ట, పులివెందులలో జరిగిన ఎన్నికల తీరు చూస్తే, ఆయన పాలన ప్రజలకు పూర్తిగా తెలిసిపోయిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తోందని, ఏజెంట్లను లేకుండా చేసి మోసపూరిత పద్ధతుల్లో గెలిచిందన్నారు. చివరికి పోలీసు అధికారులు సైతం కూటమి ప్రభుత్వానికి లొంగిపోయి, వారి ఆదేశాలను పాటిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలలో రాక్షసత్వం, రౌడీయిజం చేసే టీడీపీని అధికారం నుంచి తొలగించే రోజు త్వరలోనే వస్తుందన్నారు.

వీబీఆర్‌లో 15 టీఎంసీల నీరు

వెలుగోడు: బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(వీబీఆర్‌)కు కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి. గురువారం సాయంత్రం సమయానికి వీబీఆర్‌లో 15.598 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఏఈ శివనాయక్‌ తెలిపారు. వీబీఆర్‌ నుంచి దిగువకు 7365 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

నంద్యాలలో నకిలీ టీటీడీ సిఫార్సు లెటర్లు

నంద్యాల: టీటీడీ నకిలీ లెటర్లు తయారు చేసి వేల రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్న వ్యక్తిని నంద్యాల పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నంద్యాల వన్‌టౌన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన మేరకు.. నంద్యాల బైర్‌మల్‌ వీధిలో అద్దె ఇంట్లో ఉంటున్న వెంకటేశ్వర్లు అనే యువకుడు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేరుతో నకిలీ టీటీడీ లెటర్లు తయారు చేశాడు. అంతేకాకుండా ఎంపీ సంతకాన్ని పోర్జరీ చేసి విక్రయించాడు. నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన జగదీష్‌ అనేవ్యక్తి వద్ద రూ.1,500 తీసుకొని ఎంపీ పేరుతో పోర్జరీ చేసిన లెటర్‌ప్యాడ్‌ను ఇచ్చి తిరుమల దర్శనానికి పంపారు. తిరుమలలో నకిలీ లెటర్‌ అని, దర్శనం లేదని చెప్పడంతో మోసం బయట పడింది. పట్టణంలోని తెలుగుపేటకు చెందిన దినేష్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement