
జెండా పండుగకు సర్వం సిద్ధం
నంద్యాల: స్వాతంత్య్ర వేడుకలకు నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం ముస్తాబైంది. జెండా పండుగను తిలకించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వీఐపీల కోసం గ్యాలరీలను తీర్చిదిద్దారు. విద్యార్థులు, మహిళలు, ప్రజలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. తాగునీరు అందుబాటులో ఉంచడంతోపాటు మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భారీగా హాజరు కానున్నారు. డీఆర్‌డీఏ, డ్వామా, వ్యవసాయం, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖలకు సంబంధించి శకటాలను ప్రదర్శనలకు సిద్ధం చేశారు. స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.