
చెరువు గండికి టీడీపీ నాయకులే కారణం
● వేగవంతంగా పనులు చేపట్టాలి
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం
వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
నందికొట్కూరు: మద్దిగుండం చెరువుకు గండి పడటానికి టీడీపీ నాయకులే కారణమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. మిడుతూరు మండల పరిధిలోని మద్దిగుండం చెరువుకు పడిన గండిని గురువారం బైరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువు కట్టపై చెట్లను తొలగించడంతో ఇటీవల కురిసిన వర్షాలకు గండి పడిందన్నారు. ఇంత వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలాంటి చర్యలు ఎందుకు చేపట్టలేదని మండిపడ్డారు. సొంత జేసీబీలతో ఇష్టానుసారంగా పనులు చేయడంతో గండిపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద చెట్లను తొలగించే సమయంలో అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆరోపించారు. చెట్లు తొలగించడంతోనే చిన్న రంధ్రం పడి పెద్దగా గండి పడి చెరువులో నీరంతా పంట పొలాల్లోకి వెళ్లి పంట నష్టం జరిగిందన్నారు. చెరువు పని చేసిన వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో రైతాంగానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్న తప్పులు చేస్తేనే కేసులు పెడుతున్నారని, చెరువు పనులు ఎలా పడితే అలా చేసిన కాంట్రాక్టర్లపై ఇరిగేషన్ అధికారులు ఏమైనా కేసులు పెట్టారా అని ఆయన ప్రశ్నించారు. త్వరితగతిన అధికారులు చెరువుకు మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. అవసరం లేని పనులు చేసి నాయకులు జేబులు నింపుకుంటున్నారే తప్ప నాణ్యతగా చేయలేదన్నారు. గండిపడి మూడు రోజుల అయినా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకేష్‌రెడ్డి, శివరామకృష్ణారెడ్డి, శివనాగిరెడ్డి, మల్లేశ్వరరెడ్డి, గుండం హరిస్వరోత్తమరెడ్డి, రవికుమార్, స్వామిరెడ్డి, సాంబశివుడు, పుల్లయ్య, లింగారెడ్డి, రాముడు, రాము పాల్గొన్నారు.