
వరలక్ష్మీ.. నమోస్తుతే!
● శ్రీశైల ఆలయంలో
సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
శ్రీశైలంటెంపుల్: చంద్రవతి కల్యాణమండపంలో శుక్రవారం 1,600 మంది ముత్తైదువులతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించారు. వేదికపై స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తుల ఎదుట వరలక్ష్మీవ్రత కలశానికి పూజలు చేశారు. భక్తులందరి చేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవి వారిని సమంత్రకంగా ఆవహన చేశారు. గణపతిపూజ, వ్రత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని వరలక్ష్మీదేవికి, ఉత్సవమూర్తులకు శ్రీసూక్తవిధానంలో వ్రతకల్పపూర్వకంగా వరలక్ష్మీదేవి వారికి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు చేశారు. ఆ తరువాత వరలక్ష్మీ వ్రత కథను పఠించి, వ్రత మహిమ విశేషాలను భక్తులకు వివరించారు. వ్రత ముగింపుగా కర్పూర నీరాజనాలు అర్పించి కలశోద్వాశన చేశారు. శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ, ఆలయ ఏఈవో హరిదాసు, స్వామివార్ల ప్రధానార్చకులు హెచ్.వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు ఉమానాగేశ్వరశాస్త్రి, సీనియర్ వేదపండితులు గంటి రాధాకృష్ణ శర్మ, అధ్యాపకులు పూర్ణానంద, అన్ని యూనిట్ విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.

వరలక్ష్మీ.. నమోస్తుతే!