ఉయ్యాలవాడ: కన్న తల్లి ప్రేమ వెలకట్టలేనిది. పిల్లాడి మానసిక స్థితి ఎలా ఉన్నా ఆ తల్లికి అతనిలో రాజకుమారుడే కనిపిస్తాడు. సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు మానసిక వికలాంగుడైన కుమారుడిని ఓ తల్లి భుజానికెత్తుకొని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చిన తీరు ప్రతి ఒక్కరినీ హృదయాలను ద్రవింపజేసింది. దొర్నిపాడు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన మారెన్నగారి బాలపుల్లయ్య, దేవి దంపతుల కుమారుడు దిలీప్ కుమార్ పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. 1 నుంచి 8వ తరగతి వరకు స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యనభ్యసించాడు. అనంతరం సొంత గ్రామానికి సమీపంలో వున్న ఉయ్యాలవాడ మండలం హరివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతులు చదువుతున్నాడు. సోమవారం నుంచి ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను రాయించేందుకు కుమారుడి తల్లి ఆటోలో పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చింది. అక్కడి నుంచి భుజానికెత్తుకొని కేంద్రంలోకి తీసుకెళ్లింది. కుమారుడు ప్రశ్నలకు జవాబులు చెబుతుండగా స్రైబ్ సలీమ్ రాస్తున్నట్లు తల్లి దేవి వివరించింది. కుమారుడి భవిష్యత్ కోసం తల్లి తపనను చూసి పరీక్ష రాసేందుకు వచ్చిన మిగిలిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనంద బాష్పాలు కార్చారు.
కన్న ప్రేమకు ‘పరీక్ష’


