ఆళ్లగడ్డ: అశేష భక్తుల గోవింద నామస్మరణ మధ్య ప్రహ్లాదవరదుడు గరుడ వాహనంపై ఊరేగారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు ఈ కార్యక్రమం సాగింది. అహోబిలేశుడి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టం గరుడసేవ (గరుడోత్సవం). బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటి నుంచి స్వామి వారికి జరిగే ప్రత్యేక కార్యక్రమాలు, అలంకరణలు, ఉత్సవాలు ఒక ఎత్తైతే చివరి రోజు నిర్వహించే గరుడోత్సవం ఓ ఎత్తు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కుబడులు చెల్లించుకోవడం ఆనవాయితీ. దీంతో శనివారం నుంచే దిగువ అహోబిలం భక్త జనసందోహంతో కిటకిటలాడింది. ఉదయం ఉత్సవమూర్తులను కోనేరు దగ్గరకు తోడ్కొని వెళ్లి తీర్థవారి చక్రస్నానం, సాయంత్రం ద్వాదశారాధనం, రాత్రి పుష్పయాగం నిర్వహించారు. అర్ధరాత్రి అనంతరం శ్రీ ప్రహ్లాదవరదుడు వజ్రవైడూర్యాలు , బంగారు అభరణాలు ధరించి గరుడ వాహనాన్ని అధిష్టించి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు.
పండుగలా లక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం
భూదేవి లక్ష్మీసమేతుడైన ప్రహ్లాదవరద స్వామి తెప్పోత్సవం దిగువ అహోబిలం కోనేరులో ఆదివారం కనులపండువగా సాగింది. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై కొలువుంచి మాడ వీధుల్లో ఊరేగింపుగా కోనేటి వరకు తీసుకొచ్చారు. అక్కడ వేదపండితుల పూజలు అందుకున్న ప్రహ్లాదవరద స్వామి ఉభయ దేవేరులతో తెప్పను అధిరోహించి విహరించారు. గంటపాటు సాగిన ఈ కార్యక్రమాన్ని భక్తులు తిలకించి పరవశించారు.
భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగిన దిగువ అహోబిలం
వైభవంగా లక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం
గరుడ వాహనంపై ఊరేగిన ప్రహ్లాదవరదుడు
గరుడ వాహనంపై ఊరేగిన ప్రహ్లాదవరదుడు


