ఆ ‘ఒక్కటి’ అడగొద్దు!
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తాం.. మంచి పీఆర్‌సీ ఇస్తాం.. ఇంటీరియం రిలీఫ్ ఇస్తాం..’’అని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. నెలలో 11 నుంచి 12 తేదీల వరకు వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు పడుతున్న ఇక్కట్లు అన్నీ, ఇన్నీ కావు. నూతన ఏడాదిలో జనవరి 1న కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా బ్యాంక్ ఖాతాలకు జీతాలు జమ కాలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ కూడా అందలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై 19 నెలలు అవుతోంది. ఈ కాలంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం మినహా.. ఇతరత్రా ప్రయోజనాలన్నీ ఎక్కడివక్కడ ఉండిపోయాయి.
రిటైర్డ్ ఉద్యోగుల్లో ఆందోళన
కర్నూలు జిల్లాలో 25.985, నంద్యాల జిల్లాలో 20,282 ప్రకారం ఉమ్మడి జిల్లాలో 46,287 మంది ఉద్యోగులు ఉన్నారు. 2024 జూన్ నుంచి ఈ ఏడాది డిసెంబరు వరకు ఉమ్మడి జిల్లాలో 956 మంది పదవీ విరమణ చేశారు. ఒక్కొక్కరికి రూ.35 లక్షల నుంచి రూ.కోటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంది. సగటున ఒక్కొక్కరికి రూ.50 లక్షల ప్రకారం ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలోనే రూ.478 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి ఆఫీసు సబార్డినేట్ మొదలు కొని ఉన్నత స్థాయి వరకు 30– 38 ఏళ్లపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేశారు. 2024 జూన్ నుంచి పదవీ విరమణ చేసిన వారికి చిల్లిగవ్వ ఇవ్వకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
పడిపోతున్న ‘సిబిల్ స్కోర్’
చంద్రబాబు ప్రభుత్వం 19 నెలల్లో ఉద్యోగులకు ఒక్క డీఏ ఇవ్వడం మినహా చేసింది ఏమీ లేదు. 12వ పీఆర్‌సీ ఊసే లేదు, మధ్యంతర భృతి మాట నే లేకుండా పోయింది. హెల్త్ కార్డులు పనిచేయడం లేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు 10 నెలల సెలవు జీతాలు, గ్రాడ్యుటీ చెల్లింపులు లేవు. నాలు గు విడతల సరండర్ లీవ్‌లు లేవు. కనీసం ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నారా అంటే కొన్ని నెలలుగా అది కూడా లేకుండా పోయింది. వేతనాలు సకాలంలో పడితేనే ప్రభుత్వ ఉద్యోగులు ఈఎంఐలు చెల్లించే వీలు ఉంది. ఒక్క రోజు ఆలస్యమైనా సిబిల్ స్కోర్ పడిపోతుంది.
ప్రతి నెలా 1న ప్రభుత్వ ఉద్యోగులకు
అందని వేతనాలు
పెన్షన్ రాక రిటైర్డ్ ఉద్యోగుల
ఆందోళన
నూతన ఏడాదీ తొలగని కష్టాలు
చంద్రబాబు సర్కార్‌పై నోరుమెదపని
ఉద్యోగ సంఘాల నేతలు
నేరు మెదపని ఉద్యోగ సంఘాలు
ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు నోరుమెదపడం లేదు. ఏపీ ఎన్‌జీజీఎవోస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోషియేషన్ నేతల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు ఏదైనా చిన్న ప్రయోజనం జరిగిందంటే తమ ఘనతగా చెప్పుకునే సంఘాల నేతలు నేడు వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం, ఇతర ప్రయోజనాలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నా.. ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


