మల్లన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గురువారం రాత్రి మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి దంపతులకు రాజగోపురం వద్ద దేవస్థాన అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో హైకోర్టు న్యాయమూర్తి దంపతులకు పండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకు లు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన అధికారులు స్వామివారి శేషవస్త్రాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు.
అహోబిలేశుడికి ప్రత్యేక పూజలు
దొర్నిపాడు: అహోబిలం క్షేత్రంలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామికి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాస పూజల్లో భాగంగా గోదాదేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అలాగే అధ్యాయన వారోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సహిత శ్రీప్రహ్లాదవరద స్వామికి ప్రత్యేక పూజలు అనంతరం తిరువీధుల్లో ఊరేగించారు. అహోబిలం మఠం చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రామానుజన్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.
మద్దిలేటి స్వామికి
తెప్పోత్సవం.. భక్తిపారవశ్యం
బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురంలోని మద్దిలేటి స్వామి క్షేత్రంలో గురువారం భక్తిశ్రద్ధలతో తెప్పోత్సవం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మద్దిలేటి నరసింహస్వామిని పల్లకీలో కొలువుంచి మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించి తెప్పోత్సవ సేవను అర్చకులు ప్రారంభించారు. స్వామి, అమ్మవార్లు ఆలయ పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు శోభాయమానంగా దర్శనమిచ్చారు. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు, వేదపండితులు జ్వాలా చక్రవర్తి, కళ్యాణ చక్రవర్తి, మాజీ చైర్మన్ లక్ష్మిరెడ్డి, ప్రధాన అర్చకులు మద్దిలేటిస్వామి, మనోహర్, సూపరింటెండెంట్ రామ్‌మోహన్ రావు పాల్గొన్నారు.
మల్లన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
మల్లన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి


