డీఐజీగా పదోన్నతి స్వీకరించిన విక్రాంత్‌పాటిల్
కర్నూలు: ఎస్పీ స్థాయి నుంచి విక్రాంత్ పాటిల్ డీఐజీగా పదోన్నతి స్వీకరించారు. ఏపీ క్యాడర్‌కు చెందిన 16 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ డిసెంబర్ 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి విక్రాంత్‌పాటిల్‌కు డీఐజీగా పదోన్నతి కల్పించి 2026 జనవరి 1 నుంచి పదోన్నతి జీఓ అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో గురువారం విక్రాంత్ పాటిల్ డీఐజీ పదోన్నతి స్వీకరించారు. అనంతరం కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్దిలను మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కలను అందచేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో విక్రాంత్ పాటిల్‌కు అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాంపు కార్యాలయంలో ఏపీఎస్‌పీ రెండవ బెటాలియన్ కమాండెంటు దీపికాపాటిల్‌తో కలసి కుటుంబ సమేతంగా కేక్ కట్ చేశారు.


